కట్టుకున్న భార్యను కడదాక కనురెప్పల కాపాడవలసిన భర్త భార్యను హత్య చేసిన సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి (సాగర్) మండలం నెల్లికల్ గ్రామానికి చెందిన పట్టాల రవి, నాగమ్మ దంపతులు బతుకుదెరువు కోసం 8 సంవత్సరాల కిందట పులిచెర్ల గ్రామానికి వలస వచ్చారు. పక్క గ్రామమైన పోతునూరు లో కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత నెల 28వ తేదీన నాగమ్మ వ్యవసాయ భూములో వ్యవసాయ పనులు చేస్తుండగా భర్త భార్యను ఛాతిపై బలంగా కొట్టి బావిలో పడేశాడు. ఏమి తెలియనట్టు ఇంటికి వచ్చి భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
అది తెలుసుకున్న కుటుంబ సభ్యులు భార్య నాగమ్మ మృతదేహాన్ని వెలికితీసి దహనం చేశారు. మొదటి నుండి నాగమ్మ సోదరుడు ఆమె ఆత్మహత్య పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నాగమ్మ ఒంటిపై గాయాలు ఉండటంతో సోదరుడు జూన్ 2వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రీ పోస్టుమార్టం చేశారు. భర్త రవిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా భార్యని ఛాతిపై గుద్ది హత్య చేసినట్లు భర్త రవి ఒప్పుకున్నారు. అక్రమ సంబంధాల వల్ల తరచు భార్య భర్తల మధ్య గొడవలు రావడంతో తన భార్యను అంతం చేయాలని రవి హత్య చేసినట్లు తెలిపారు. రవిని గురువారం రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.