గ్రామ తీర్పులు, కట్టుబాటు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి తీర్పులు, కట్టుబాట్లు తెలిసిన ఇద్దరు గ్రామీణ ప్రాంత యువకులు దానిని బేఖాతర్ చేసి ప్రాణాలు పొగొట్టుకొన్నారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను గ్రామస్థులు కొట్టి, కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. నిందితుల్లో ఒక యువకుడు సజీవదహనమయ్యాడు. మరో నిందితుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్లా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బుధవారం (జూన్ 8) రాత్రి 9 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను బైక్ మీద తీసుకొచ్చి ఆమె ఇంటి దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. అమ్మాయి ముభావంగా ఉండటం గమనించిన కుటుంబసభ్యులు ఏం జరిగిందని ప్రశ్నించడంతో.. సదరు యువకులు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు చెప్పింది.
బాలిక మాటలు వినగానే.. ఆగ్రహంతో ఊగిపోయిన కుటుంబసభ్యులు నిందితులను వారి ఇళ్లలోంచి బయటకి లాక్కొచ్చారు. స్థానికులతో కలిసి చితకబాదారు. ఈ క్రమంలో వారిపై కిరోసిన్ పోసి, నిప్పు పెట్టారు. ఆ మంటల్లో ఓ యువకుడు సజీవదహనమవ్వగా మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకుడిని సునీల్ ఓరాన్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బాధిత బాలిక, నిందితులిద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారని.. పక్క పక్క వీధుల్లో నివాసం ఉంటారని గుమ్లా డీఎస్పీ మనీశ్ చంద్ర తెలిపారు. నిందితులు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పగానే కుటుంబ సభ్యులు కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టారని ఆయన వెల్లడించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపైనా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.