పాకిస్తాన్ లో ఘోర విషాదం చోటు చేసుకొంది. ఈ ఘోర ప్రమాదంలో 22 మంది మరణించారు. పాకిస్తాన్ లోని బలూచిస్థాన్ ప్రాంతంలో ఓ మినీ వ్యాన్ లోయలోకి పడిన ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ప్రమాదం నుంచి ఒక్క బాలిక మాత్రమే గాయాలతో బయటపడింది. 1,572 మీటర్ల ఎత్తులో ఉన్న కిల్లా సైఫుల్లా సమీపంలోని అఖ్తర్‌జాయ్ పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మలుపు వద్ద వాహనాన్ని డ్రైవరు అదుపుచేయడంలో విఫలం కావడంతో అది వందల అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది.
జోబ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ హఫీజ్ మొహమ్మద్ ఖాసిమ్ మాట్లాడుతూ... ప్రమాదానికి గురైన మినీ బస్సు లొరాలియా నుంచి జోబ్‌కు వెళ్తోందని తెలిపారు. అఖ్తర్‌జాయ్ పర్వతాల సమీపంలో ప్రమాదం జరిగిందని, ఇప్పటి వరకూ 10 మృతదేహాలను బయటకు తీశామని చెప్పారు. లోతైన లోయ కావడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని ఖాసీవ్ అన్నారు. క్వెట్టా నుంచి సహాయక బృందాలు చేరుకున్నాయని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదం నుంచి ఒక్క బాలిక మాత్రమే గాయాలతో బయటపడినట్టు వివరించారు.
ఈ ప్రమాదంపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందజేయాలని అధికారులను ఆయన కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక, బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నాయి. పర్వత ప్రాంతం కావడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇక్కడ రహదారులు తీవ్రవాదుల కంటే ప్రమాదకరంగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతుంటారు. ఒకవేళ ప్రమాదం జరిగినా తక్షణ వైద్య సాయం కూడా అందడంలో జాప్యం జరుగుతుంది. దీంతో అనేక మంది ప్రాణాలు చికిత్స అందక గాల్లో కలిసిపోతుంటాయి.