చైనా కుయుక్తులను అరికట్టడంలో భాగంగా భారత ప్రభుత్వం ఇతర దేశాల సఖ్యత విషయంలో కీలక అడుగులు వేస్తోంది. చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ.. భారత్, వియత్నాం దేశాలు రక్షణ పరంగా దగ్గరవుతున్నాయి. మన దేశం నుంచి ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలుకు వియత్నాం ఆసక్తి చూపుతోంది. 2030 నాటికి ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా.. భారత్, వియత్నాం బుధవారం దార్శనిక పత్రంపై సంతకాలు చేశాయి. వియత్నాం పర్యటనకు వెళ్లిన రాజ్‌నాథ్.. రాజధాని హనొయ్‌లో ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్‌జియాంగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల సైన్యం తమ మిలటరీ బేస్‌లను పరస్పరం ఉపయోగించుకునేలా భారత్, వియత్నాం ఒప్పందం చేసుకున్నాయి. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫన్ వాన్ గియాంగ్ ఒప్పందాలపై సంతకాలు చేశారు.
మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ కోసం వియత్నాం ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశం భారత్ కావడం గమనార్హం. ఈ ఒప్పందం ఫలితంగా భారత యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఇంధనం నింపుకోవడం కోసం, రిపేర్లు, ఇతర అవసరాల కోసం వియత్నాం మిలటరీ బేసులను ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వియత్నాం, భారత్ విస్తృత స్థాయిలో చర్చలు జరిపాయి. దక్షిణ చైనా సముద్రంలో ప్రాదేశిక సరిహద్దు విషయమై చైనాతో వివాదం ఉన్న ఆరు దేశాల్లో వియత్నాం ఒకటి. చైనాతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గత కొన్నేళ్లుగా వియత్నాం భారత్‌కు దగ్గరవుతోంది. 2016 నుంచి ఇరు దేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. రక్షణ సహకారం అనేది ఇందులో ప్రధానమైంది. భారత్ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో, ఇండో-పసిఫిక్ విజన్‌లో వియత్నాం కీలక భాగస్వామి.
రాజ్‌నాథ్ సింగ్ కోసం వియత్నాం అధ్యక్షుడు నుగుయెన్ జువాన్ ఫుసి ప్రోటోకాల్ నిబంధనలు పక్కనబెట్టడం గమనార్హం. మీటింగ్‌లో ఉన్న ప్రోటోకాల్‌ను అతిక్రమించి మరీ రాజ్‌నాథ్ చూసేందుకు వచ్చారు. డిఫెన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్ ప్రోగ్రాంలో భాగంగా భారత్‌లోని ఎల్ అండ్ టీ షిప్ యార్డులో ఐదు బోట్లను నిర్మించగా.. వియత్నాంలోని హాంగ్ హా షిప్ యార్డ్‌లో ఏడు బోట్లను తయారు చేసినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. వియత్నాం బోర్డర్ గార్డ్ కోసం హాంగ్ హా షిప్ యార్డ్‌లో 12 హై స్పీడ్ గార్డ్ బోట్ల తయారీ ప్రక్రియ పూర్తయినట్లు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. మేకిన్ ఇండియా అండ్ మేక్ ఫర్ ది వరల్డ్ మిషన్‌కు ఇది ఉదాహరణ అని రక్షణ మంత్రి తెలిపారు.