హిందూ, ముస్లింల ఐక్యత గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అనాదిగా ఈ రెండు వర్గాల ఐక్యతా ఘటనలను మనం చూస్తూ వస్తున్నాం. తమిళనాడులో హిందువులతో పాటు ఆలయ కుంభాభిషేకంలో పాల్గొని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువారూర్ జిల్లా కూత్తనల్లూరులో చోటుచేసుకుంది. అక్కడ ముత్తుమారియమ్మన్ ఆలయ మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో హిందువులతో పాటు ముస్లింలు కూడా హాజరై మతసామరస్యాన్ని ఎలుగెత్తి చాటారు. ముత్తుమారియమ్మన్ సహా ఆలయ ప్రాంగణంలోని వినాయకుడు, బాలమురుగన్ సన్నిధులకు 15 ఏళ్ల తర్వాత గురువారం కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు.
ఈ ఉత్సవంలో పండుతక్కడి, అక్కరై పుదువీది సహా చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు, ముస్లింలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన యాగశాల ప్రత్యేక వేదికపై పవిత్ర నదీజలాలున్న కలశాలను ఉంచి గణపతి హోమం సహా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం యాగపూజ, గోపూజ, సరస్వతి పూజతో పాటు పూర్ణాహుతి జరిగింది. అనంతరం ఉదయం 10.15 గంటలకు యాగశాలలోని కలశాలను గ్రామస్థులు, ముస్లిం మతపెద్దల సమక్షంలో ఊరేగింపుగా ఆలయ రాజగోపురాలపైకి వేదపండితులు చేర్చారు.
తిరువాడుదురై కీర్తివాసన్ గురుక్కల్ పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు కే బాలకృష్ణన్, మరో పదిమంది వేదపండితులు కలశాలతో గోపురాలపైకి చేరుకున్నారు. ఆ తర్వాత గోపురాలను కలశాలలో ఉన్న పవిత్ర జలాలతో అభిషేకించారు. ఈ వేడుకల్లో నగర పంచాయతీ స్థానిక కార్పొరేటర్ ఆర్ మహమ్మద్ కాదర్ మైదీన్, మాజీ కార్పొరేటర్ మీరామైదీన్ తదితరులు పాల్గొన్నారు. హిందువులు, ముస్లింలు కలిసి ఈ కుంభాభిషేక వేడుకల్లో పాల్గొని మరోసారి మతసామరస్యాన్ని చాటారు.