మనం మానవత్వం మంటగలిసిన ఘటనలను ఇటీవల ఎక్కువగా ఆసుపత్రుల వద్దే చూస్తున్నాం. ఇలాంటి ఘటన రోజుకొక్కటి వెలుగులోకి వస్తోంది. అనారోగ్యంతో చనిపోయిన తన కుమార్తె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటుచేయమని కోరితే ఆస్పత్రి వర్గాలు స్పందించకపోవడంతో భుజాలపైనే మోసుకెళ్లిన హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛత్రపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బక్స్వాహ సమీపంలోని పౌడీ గ్రామానికి చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బక్స్వాహ నుంచి పక్కనే ఉన్న దమోహ్ జిల్లా ఆస్పత్రికి మంగళవారం తరలించారు. కానీ, అదే రోజున చిన్నారి కన్నుమూసింది.
మృతదేహాన్ని తరలించడానికి ఆస్పత్రి సిబ్బందిని సంప్రదించగా వారు స్పందించలేదని బాలిక తాత మన్షుఖ్ అహిర్వార్ ఆరోపించారు. ప్రయివేట్ అంబులెన్స్‌లో తీసుకొచ్చేందుకు తమ వద్ద డబ్బులు లేకపోవడంతో మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి బక్స్వాహకు అక్కడ నుంచి బస్సెక్కి వచ్చామని కన్నీటిపర్యంతమయ్యాడు. అక్కడకు చేరుకున్న తర్వాత తమ గ్రామానికి వెళ్లేందుకు వాహనం ఏర్పాటుచేయాలని నగర పంచాయతీని కోరితే వారి నిరాకరించారని బాలిక తండ్రి లక్ష్మణ్ అహిర్వార్ వాపోయారు.
అయితే, ఈ ఆరోపణలను దమోహ్ ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ మమతా తిమోరి ఖండించారు. అంబులెన్స్ ఏర్పాటుచేయాలని తమను ఎవరూ సంప్రదించలేదని అన్నారు. రెడ్ క్రాస్ లేదా ఇతర ఎన్‌జీవోల ద్వారా తాము ఉచితంగానే వాహనాలను ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మండుటెండలో కుమార్తె శవాన్ని తండ్రి కాలినడక మోసుకెళ్తుండట అందర్నీ కలచివేస్తోంది.
ఇదిలావుంటే సాగర్ జిల్లాలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. చనిపోయిన తన సోదరుడి మృతదేహాన్ని ఓ వ్యక్తి ఆస్పత్రి నుంచి ఎండ్ల బండిలో తీసుకొచ్చాడు. గధ్‌కోటా ప్రాథమిక ఆస్పత్రిలో తన సోదరుడు చనిపోతే శవాన్ని తరలించడానికి అంబులెన్స్ ఏర్పాటు చేయమని కోరితే నిరాకరించారని, చివరకు ఎండ్ల బండిలో తీసుకురావాల్సి వచ్చిందని భగవాన్ దాస్ అనే వ్యక్తి తెలిపాడు. అయితే, అక్కడ మెడికల్ అధికారి వాదన మరోలా ఉంది. ఆస్పత్రికి వచ్చేసరికే రోగి చనిపోయాడని, పోస్ట్‌మార్టం చేయాల్సి ఉంటుందని డ్యూటీ డాక్టర్ చెబితే వాళ్లు నిరాకరించారని అన్నారు.