సరదాగా గడిపేందుకు బీచ్ కు వెళ్లిన ఓ కుటుంబం భారీగా ఎగిసి పడుతున్న అలలు తాకిడికి సముద్రంలోకి కొట్టుకు పోయింది. ఊహించని పరిణామంతో ఇతర కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తమ కళ్ల ముందే తమ కుటుంబ సభ్యులు సముద్రంలోకి కొట్టుకొని పోవడం చూసి తట్టుకోలేకపోయారు. అప్పటివరకు అందరితో సరదాగా గడిపిన వారు అకస్మాత్తుగా సముద్రంలో గల్లంతు కావడంతో ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గల్లంతైన వారి గాలింపు చర్యలు చేపట్టిన ప్రయోజనం లేకుండా పోయింది. అయినప్పటికీ గజ ఈతగాళ్ల తో గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం, రామచంద్రపురం సమీపంలోని కొవ్వాడ బీచ్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు.
గల్లంతయిన వారిని భీమిలి మండలం కె. నగర పాలెంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె, మేన కోడలు సముద్రంలో గల్లంతయ్యారు. రణస్థలం మండలం, రామచంద్రపురంలో గల బంధువులు ఇంటికి కె. నగరపాలెం కు చెందిన గణేష్ తన కుటుంబ సభ్యులతో శనివారం ఉదయం వచ్చారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు తాము ఉంటున్న ఊరు నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరం లో కొవ్వాడ బీచ్ కు కుటుంబ సభ్యులతో వెళ్లారు.
సముద్రం స్నానం కు వెళ్లిన సమయంలో గణేష్ (42) మానస (9) దీవెనలు గల్లంతయ్యారు.మానస గణేష్ కూతురు కాగా దీవెన అతని మేనకోడలు. వేసవి సెలవుల దృష్ట్యా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు రణస్థలంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. గణేష్ కు పెళ్లి అయ్యి పదేళ్లు అవుతుంది. అతనికి ఒక పాప,బాబు ఉన్నారు. భార్య ఈశ్వరమ్మ కాగా కుమార్తె మానస,. కుమారుడు యస్వంత్ లు ఉన్నారు. ఈ ప్రమాదంలో గణేష్ తో పాటు అతని కుమార్తె మానస, మేన కోడలు దీవెన గల్లంతయ్యారు.