ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరం వైసీపీలో టిక్కెట్ వార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 04:12 PM

వచ్చే ఎన్నికల్లో ఎవరికి పార్టీ టిక్కెటు అన్న దానిపై  గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని వైసీపీ నేతల మధ్య ఇప్పటినుంచే వార్ మొదలైంది. వల్లభనేని వంశీ రాకతో గన్నవరంలో ఈ వార్ మొదలైంది.  దీంతో గన్నవరం వైసీపీలో రాజకీయాలు వేడెక్కాయి. వల్లభనేని వంశీ వర్సెస్ దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వంశీ వ్యాఖ్యలకు రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. తాను గుంపులుగా ఎన్నికలకు వెళ్లలేదని, ఒంటరిగా వెళ్లానని.. వంశీ బీజేపీ, జనసేన, వామపక్షంతో కలిసి పోటీ చేసి గెలిచారన్నారు. వల్లభనేని వంశీకి టికెట్ ఇస్తే పనిచేయనని తేల్చి చెప్పారు. ఆయన చేసిన అవమానాలకు తాను పనిచేయనని..మనుషుల డాక్టర్‌ను, కుక్కల గురించి తనకు తెలియదన్నారు. తాను ఫ్యాక్షన్‌ రాజకీయ నాయకుడ్ని కాదన్నారు.


రాజకీయాల్లోకి వచ్చి 38 ఏళ్లవుతోందని.. ఒక్కసారి కూడా చంద్రబాబు ఇప్పటి వరకు చూడలేదని.. కేవలం టీవీ, పేపర్‌లో మాత్రమే చూశానన్నారు. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ల గురించి తాను స్పందించనన్నారు. గన్నవరం నియోజకవర్గంలో క్వారి, చెరువుల మట్టికి సంబంధించి విచారణ జరిపి శిక్షించాలని తాను చెప్పానన్నారు. విచారణలో ఎవరు దోషులైతే వారిపై చర్యలు తీసుకోవచ్చన్నారు. టికెట్ గురించి చెప్పాల్సింది అధిష్టానం అన్నారు. ఇప్పటి వరకు తనకు పదవి కావాలని ఎవర్నీ అడగలేదని.. జగన్ పిలిచి తనకు టికెట్ ఇచ్చారన్నారు. వంశీ కోసం పనిచేయనని.. వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి ఇంట్లో కూర్చుంటాను అన్నారు.


వల్లభనేని వంశీ కేవలం 800 మెజార్టీతోనే గెలిచారని.. ఆయన ఆకాశం నుంచి ఊడిపడలేదన్నారు. 2014లో కూడా జనసే, బీజేపీతో కలిసి పోటీచేసి విజయం సాధించారన్నారు. తన తండ్రి 11 ఎకరాల పొలం ఇస్తే.. తాను 8 ఎకరాలు మిగిల్చానన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక మూడు ఎకరాలు అమ్ముకున్నట్లు చెప్పుకొచ్చారు. గన్నవరం వదిలిపెట్ట ఎక్కడికి వెళ్లే వ్యక్తిని కాదన్నారు. 2004లోనే వైఎస్సార్ తనను పోటీ చేయాలని కోరారని.. తాను మాత్రం స్థోమత సరిపోదని దూరంగా ఉన్నానన్నారు.


తన చిన్న తనం నుంచి కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నాను అన్నారు వైఎస్సార్‌సీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. తన వర్గానికి ఏ పదవులు ఇవ్వకపోయినా మాట్లాడలేదని.. అలాగే తనకు 13 నెలల పదవీ కాలం దక్కిందన్నారు. తాను ఎప్పుడూ రాజకీయాల్లో ఎవర్నీ తిట్టలేదని.. తాను సొంతంగా కంపెనీ పెట్టి 23 ఏళ్లు అయ్యిందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వంశీ జగన్, భారతిని విమర్శించారని.. ఇప్పుడు వైఎస్సార్‌సీపీలోకి వచ్చి చంద్రబాబు, భువనేశ్వరిని విమర్శించారన్నారు.


అసలు రాజకీయాల్లో తిట్టాల్సిన పని ఏముందని.. తిట్టుకుంటే రాజకీయాల్లో విలువ ఉండదన్నారు వెంకట్రావు. చదువు సంస్కారం నేర్పించాలన్నారు. టికెట్ ఎవరికి అన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని.. వల్లభనేని వంశీ తో కలిసి పనిచేయలేనని జగన్‌కు చెప్పానన్నారు. నియోజకవర్గంలో ప్రతి గడపవకు వెళ్లాను.. ఒకానొక సమయంలో అవసరమైతే నియోజకవర్గాన్ని వదలుకోవడానికి సిద్ధమయ్యానన్నారు. తాను ఎక్కడా అవినీతి చేయలేదని.. వంశీ దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చి గెలిచారన్నారు. తన కార్యకర్తల ఇళ్లకు వెళ్లొద్దని చెప్పడానికి ఆయన ఎవరని.. గత ఎన్నికల్లో నైతికంగా గన్నవరంలో తానే గెలిచినట్లుగా చెప్పుకొచ్చారు. రిగ్గింగ్‌తో వల్లభనేని వంశీ గెలిచారని.. వంశీతో కలిసి పనిచేయలేనని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa