కోర్టు అన్నక ఓ పద్దతి ఉంటుంది. ప్రవర్తన విషయంలోనే కాదు డ్రస్ విషయంలోనూ ఇది వర్తిస్తుంది. అది విస్మరిస్తే ఇలా జరుగుతుంది. బీహార్ లో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కోర్టు ప్రోటోకాల్ తెలియక జడ్జి చేతిలో అక్షింతలు వేయించుకున్నారు. గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్ కిశోర్ ఓ కేసులో పాట్నా హైకోర్టుకు హాజరయ్యారు. అయితే, ఆయన ధరించిన దుస్తులు జడ్జి పీబీ భజంత్రీకి చిరాకు తెప్పించాయి. దాంతో ఆయన ఆ ఐఏఎస్ అధికారిని ఏకిపారేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదిలావుంటేజడ్జి చేతిలో మొట్టికాయలు తిన్న ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆనంద్ కిశోర్ బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచారు.
కోర్టులో ఆ ఐఏఎస్ అధికారితో కోర్టు జడ్జీ ఇలా అన్నారు. "సాధారణ డ్రెస్ ధరించి రావడానికి ఇదేమైనా సినిమాహాలు అనుకుంటున్నారా? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఎలాంటి డ్రెస్ తో కోర్టుకు రావాలో మీకు తెలియదా? ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు మీరు? ముస్సోరీలో మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు, కోర్టుకు హాజరయ్యేటప్పుడు వేసుకోవాల్సిన దుస్తుల గురించి మీకు బోధించలేదా? మెడ కనిపించకుండా కాలర్ బటన్స్ పెట్టుకోవాలని మీకు ఎవరూ చెప్పలేదా? కనీసం కోట్ అయినా ధరించాలి కదా!" అంటూ ఆ సీనియర్ ఐఏఎస్ అధికారిని ఉక్కిరిబిక్కిరి చేశారు.