పోలీసుల ఎదుట మావోయిస్ట్ సానుభూతి పరులు లొంగిపోయారు. ఇది మావోయిస్ట్ లకు పెద్ద దెబ్బగానే చెప్పవచ్చు. కొన్ని నెలల క్రితం జిల్లాలోని చివరి మావోల స్థావరాన్ని బీఎస్ఎఫ్ బలగాలు చేజిక్కించుకోవడంతో జంత్రి పంచాయతీ వాసులు మార్పును గమనిస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 2న, పోలీసు డీజీ సునీల్ బన్సల్ స్వాభిమాన్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు 50 మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోగా, తాజాగా అదే పంచాయతీలో 180 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. ఈ సందర్భంగా మావోయిస్టు దుస్తులను తగులబెట్టారు.
ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో 180 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు పోలీసులు ముందు లొంగిపోయారు. ఏవోబీలోని మల్కన్‌గిరి జిల్లా జోడంబో పోలీస్‌స్టేషన్, జంత్రీ పంచాయతీ పరిధిలోని ధాకడ్‌పదర్, డాబుగూడ, అర్లింగ్‌పడ గ్రామాలకు చెందిన మావోయిస్టు మిలీషియా సభ్యులు బీఎస్ఎఫ్ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లొంగిపోయారు.
లొంగిపోయిన మావోయిస్టు సానుభూతిపరులు ఎదురుకాల్పులు, హత్యల్లో పాల్గొన్నారు. ఇకపై మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనబోమని ప్రతిజ్ఞ చేశారు. ఏవోబీ మల్కన్‌గిరి జిల్లాలో యాంటీ నక్సల్ ఆపరేషన్ జోరుగా సాగుతోంది. జిల్లా నుంచి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించేందుకు బీఎస్ఎఫ్ జిల్లాకు వచ్చి ఆ తర్వాత మల్కన్‌గిరి జిల్లా రూపురేఖలను మార్చేసింది. క్రమంగా ఒక మావోయిస్టు కోటను బీఎస్ఎఫ్ బలగాలు ఆక్రమించుకున్నాయి.