ఏపీలో మద్యం ఆదాయాన్ని చూపించి బ్యాంకుల వద్ద రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్ల రుణాలు తీసుకుందని నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శలుగుప్పించారు.అడ్డదారుల్లో రుణాలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 8 వేల కోట్ల లిక్కర్ బాండ్స్‌ను విడుదల చేసిందని చెప్పారు. మార్జిన్ పేరుతో బెవరేజ్ కార్పొరేషన్‌కు ఆదాయాన్ని చూపించారని విమర్శించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించారు. లిక్కర్‌పై ఎలాంటి ఆదాయం వచ్చినా ప్రభుత్వ ఖజానాకే చేరాలని స్పష్టం చేశారు.
ఏపీలో మద్యం ఆదాయాన్ని చూపించి బ్యాంకుల వద్ద రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్ల రుణాలు తీసుకుందని ఎంపీ రఘురామ చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎంపీ రఘురామ ఆదివారం మీడియాతో మాట్లాడారు. మద్యపాన నిషేధం హామీకి సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నారని చెప్పారు. 2024 ఎన్నికల నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని.. లేదంటే ఓట్లే అడగనని సీఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటిది, ఇప్పుడు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని చెప్పారు. లిక్కర్ బాండ్లపై రుణం తీసుకునే అంశంపై న్యాయస్థానంలో కేసు వేశానని.. ఈ నెల 15న ఇది విచారణకు రానుందని ఎంపీ రఘురామ చెప్పారు.
ఇక, తనపై వైసీపీ వేసిన అనర్హత పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ కార్యాలయం రియాక్ట్ అయిన నేపథ్యంలో ఎంపీ రఘురామ ఈ విషయమై స్పందించారు. తన అనర్హత పిటిషన్‌పై నిర్ణయం ఎప్పుడని రాష్ట్రపతిని అడిగారట అంటూ ఎద్దేవా చేశారు. పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించినప్పుడు మాత్రమే తనపై అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉందని పునరుద్ఘాటించారు. అయితే, పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసేందుకు నాయకత్వానికి పూర్తి అధికారం ఉందన్నారు. ఎంపీ అనర్హత వేటు విషయంలో మాత్రం లోక్‌సభ నియమావళి ప్రకారమే జరగాలని వ్యాఖ్యానించారు.
మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి మృతిపై రఘురామ తీవ్రంగా స్పందించారు. సాక్షి గంగాధర్ రెడ్డి మరణంపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటి వరకు ముగ్గురు సాక్షులు చనిపోయారని.. ఉన్న సాక్షులనైనా కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.