మనం ఉండే భూమి కింద ఏముందో..ఏ నగరముందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కాలగర్భంలో ఎన్నో నగరాలు, నదులు మునిగిపోతుంటాయి. కఠిన పరిస్థితులు కొన్నిసార్లు కీలక విషయాలను బయటపడేలా చేస్తాయి. ఇరాక్‌లో కరువు కారణంగా ఇప్పుడు ఇలాంటిదే ఒక మరుగునపడిన రహస్యం వెలుగులోకి వచ్చింది. రహస్యం మాత్రమే కాదది.. పురాతన నగరం. అవును, కరువు పరిస్థితుల కారణంగా టైగ్రిస్ నది పరివాహక ప్రాంతంలో ఎండిపోయిన భాగంలో అతి పురాతనమైన నగరం ఒకటి బయటపడింది. ఇరాక్‌లోని కెమునేలో కుర్దిస్థాన్ రీజియన్‌లో బయటపడ్డ ఈ నగరం సుమారు 3,400 ఏళ్ల కిందట అక్కడ మహోజ్వలంగా వెలుగొందినట్లు పరిశోధకులు భావిస్తున్నారు.
టైగ్రిస్ నదిపై నిర్మించిన ఓ భారీ జలాశయం కరువు కారణంగా ఎండిపోయిన క్రమంలో.. ఈ నగరం ఆనవాళ్లు బయటపడ్డాయి. ప్రస్తుతం నదిలో నీళ్లు లేకపోవడంతో ఇక్కడ తవ్వకాలకు వీలు కలిగింది. ఈ నగరం కాంస్య యుగానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు.
‘క్రీ.పూ 1550 - క్రీ.పూ 1350 మధ్య మిట్టని సామ్రాజ్య పాలనలో భాగంగా ఈ నగరం ఉండవచ్చు. రాజ్యంలో కీలక కేంద్రంగా విలసిల్లి ఉండవచ్చు’ అని జర్మనీ, కుర్దిష్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది.
‘ఈ నగరం నేరుగా టైగ్రిస్ నదిలో బయటపడింది. అంటే.. అప్పట్లో ఇది మిట్టని సామ్రాజ్యంలోని ప్రధాన ప్రాంతాలను, ముఖ్యంగా తూర్పు ప్రాంతం (ప్రస్తుతం ఇది సిరియాలో ఉంది)తో అనుసంధానించడంలో ముఖ్యమైన పాత్ర పోషించి ఉండవచ్చు’ అని డాక్టర్ ఇవాన పుల్జిజ్ అన్నారు. జర్మనీ పురావస్తు బృందంలో సభ్యులుగా ఉన్న పుల్జిజ్.. ఈ నగరం గురించి పత్రికా ప్రకటన చేశారు.
నగరం బయటపడిన ప్రాంతంలో తవ్వకాలు జరిపితే మరిన్ని ఆధారాలు, ఆనవాళ్లు లభించే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఈ జలాశయంలో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. దీంతో.. పురాతన నగరం మరింత దెబ్బ తినకుండా ఉండేందుకుగాను దాన్ని పూర్తిగా ప్లాస్టిక్ షీట్లతో కప్పి ఉంచారు. మట్టి గోడలను, శిథిలాల్లో ఉన్న ఇతర వస్తువులను సంరక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.