ప్రపంచంలో కోట్లాది మంది యువతకు ఆదర్శ విప్లవకారుడు చేగువేరా అని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి, ఏ. ఐ. వై. ఎఫ్. జిల్లా కార్యదర్శి ఐనింటి. లోకానాధంలు అన్నారు. శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద గల కామ్రేడ్ ఎన్. ఆర్. దాసరి క్రాంతి భవనంలో చేగువేరా 94వ జయంతి సందర్భంగా ఏ. ఐ. వై. ఎఫ్. ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్జెంటీనాలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జూన్14, 1928లో చేగువేరా జన్మించారని తెలిపారు. అతి పన్న వయస్సులో డాక్టరు వృత్తి చేసుకుంటూ తన చుట్టూ జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారని అన్నారు. ఇరవై ఏడేళ్ల వయస్సులో క్యూభా విప్లవ నాయకుడు ఫిడేల్ కాస్ట్రో కలిసి స్ఫూర్తి పొందారని అన్నారు.
దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా ప్రపంచంలో అనేక దేశాల్లో ఉద్యమాలు చేపట్టి కోట్లాది మంది విప్లవకారులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. 33 ఏళ్లకే క్యూబా పరిశ్రమల శాఖ మంత్రి పదవిని పొందారని, 36 యేళ్ళ వయస్సులో ఐక్యరాజ్య సమితిలో క్యూబా ప్రతినిధిగా పాల్గొని ప్రసంగించి ప్రపంచ దేశాల మన్ననలు పొందారని కొనియాడారు. భారత్ లో పర్యటించి క్యూబాకు మద్దతు కూడగట్టడంలో సఫలం అయ్యారని తెలిపారు. చేగువేరా విప్లవ పంథాను భయపడి బొలీవియా సైన్యంతో కుమ్మక్కై అమెరికా అక్టోబరు9, 1967 లో 39 ఏళ్ళలో హత్య చేసిందని ఆయన వివరించారు. నేడు చేగువేరా ఒక వ్యక్తి కాదు, మహా శక్తి అని కోట్లాది మంది యువతకు ఆదర్శ ప్రాయ విప్లవ నేత అని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు యడ్ల గోపి, ఏ. ఐ. టి. యు. సి. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి డోల శంకరరావు, అనపాన షణ్ముఖ రావు, నిమ్మాడ కృష్ణమూర్తి, బలగ రమేష్, నజీర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.