ప్రతి జీవి ఒకేరకంగా ఉండకపోవడం , జంతువులు ఒకలా , పక్షులు ఒకలా, మనుషులు పోకడల ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం . మనిషికి మనిషే పుట్టడం , పులికి పులి పిల్ల , మేక కి మేక పిల్ల పుట్టడం చూసాం కానీ మేకకి పులి పిల్ల , మనిషికి మేక పిల్ల పుట్టడం లాంటివి మనం చూడలేదు అవునా... అందులో కూడా పుట్టిన ప్రతి జీవి ఒకరికి ఒకరు సంబంధం లేని పోలికలతో పుట్టడం జరుగుతుంది . ఎప్పుడైనా ఆలోచించారా ఇలా ఎలా అని . కొంత మంది విజ్ఞానం తెలిసిన వారికి మాత్రమే కొంత అవగాహన ఉంటుంది . కొంత మంది అంత దేవుడి సృష్టి అని అంటుంటారు . కానీ , ఏదిఏమైనా వీటన్నిటికీ సమాధానం డిఎన్ఏ (DNA). ఒక్కో జీవి లో ఒక్కో రకమైన డిఎన్ఏ కోడ్ ఉండటం వలన ఒకరికి మరొకరు పోలిక లేకుండా పుడతారు.
అసలు ఈ డిఎన్ఏ అంటే ఏమిటో తెలుసుకుందాం . డిఎన్ఏ అంటే Deoxyribonucleic acid అని అర్థం. ప్రాణం ఉన్న ప్రతి జీవి లో డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ కారణంగానే ప్రతి ఒక్కరు వేరు వేరు గా కనిపిస్తారు. జంతువులకి, మనుషులకి, జీవం ఉన్న ప్రతి జీవి మధ్య తేడాని తెలియ చెప్తుంది .డిఎన్ఏ కారణంగానే , పుట్టిన పిల్లలు వాళ్ళ తండ్రిలా లేదా తల్లిలా కనిపిస్తారు.డిఎన్ఏ లో మనకు సంబంధించిన మొత్తం సమాచారం నిల్వ చేయబడి ఉంటుంది. మరి ఇంత ముఖ్యమైన సమాచారాన్ని నిల్వ ఉంచే డిఎన్ఏ శరీరంలో ఎక్కడ ఉంటుందని మీకు సందేహం రావొచ్చు. మన శరీరంలో కొన్ని మిలియన్ల కణాలు ఉంటాయి. ఇవి రోజూ పుడుతూ చనిపోతూ ఉంటాయి. డిఎన్ఏ మన శరీరం లోని కణాలలో ఉండే నూక్లియస్ లో ఉంటుంది, ఇదే నూక్లియస్ కణాన్ని నియంత్రిస్తుంది.డిఎన్ఏ ఒక నిచ్చెన ఆకారం కలిగిన నిర్మాణం లో ఉంటుంది. ఈ మొత్తం సముదాయాన్ని క్రోమోజోమ్ అంటారు. ఈ క్రోమోజోముల సంఖ్య ప్రతి జీవి లో వేరు వేరుగా ఉంటాయి. మనుషులలో ఒక్క కణం లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 46 క్రోమోసోములలో 23 మన తండ్రి నుంచి మిగతా 23 తల్లి నుంచి వస్తాయి. నిచ్చెన ఆకారంలో ఉన్న ఈ డిఎన్ఏ ఒక కోడ్ తో నిర్మించబడి ఉంటుంది. ఈ కోడ్ అడెనీన్ , గువానిన్, సైటోసిన్ , థైమిన్ అనే రసాయనిక సమ్మేళనాలతో నిర్మించబడి ఉంటుంది.
వీటినే AGCT అని కూడా అంటారు. ఈ AGCT లు కలిసి డిఎన్ఏ కోడ్ ని తయారు చేస్తాయి. ఉదాహరణకి AT GC TA అని ఇలా కోడ్ రూపంలో మన డిఎన్ఏ ఉంటుంది. ఈ కోడ్ చాలా పెద్దగా ,ఎంత పెద్దగా అంటే మన భూమి నుంచి ప్లూటో వద్దకు వెళ్లి తిరిగి రా గలదు.
ఇంత పెద్ద డిఎన్ఏ కోడ్ మళ్లీ అనేక భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఇందులో కొన్ని భాగాలు చిన్నవిగా మరి కొన్ని భాగాలు పెద్దవిగా ఉంటాయి. ఈ చిన్న,పెద్ద భాగాలుగా ఉన్న డిఎన్ఏ కోడ్ నే మనం జీన్ (Gene) అని అంటాము.
డిఎన్ఏ, అర్ఎన్ఏ (RNA) సహాయంతో మన శరీరంలో ప్రోటీన్స్ను తయారు చేస్తుంది. ఈ ప్రోటీన్స్ మన శరీరంలోని వివిధ మార్పులకు ముఖ్య కారణంగా ఉంటాయి.
ఈ ప్రోటీన్స్ వల్లనే మనమందరం వేరు వేరు గా కనిపిస్తాము. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన డిఎన్ఏ కోడ్ ఉంటుంది. ఏ ఇద్దరిలో ఇది ఒకేలా ఉండదు.
జెనెటిక్ కోడ్ మనకు మన తండ్రి మరియు తల్లి నుంచి వస్తుంది అందుకే మనము అమ్మ లాగా లేకా నాన్న లాగా కనిపిస్తాము. మన శరీరంలోని ప్రతి కణం లో ఉండే డిఎన్ఏ లో ఈ సమాచారం ఉంటుంది. అందుకే మన శరీరంలోని ఏ చిన్న భాగం ను తీసుకున్న డిఎన్ఏ పరీక్ష చేసి ఆ వ్యక్తి ఏవరో గుర్తు పట్టవచ్చు. అందుకే కొన్ని నేర నిర్ధారణ కేస్ లలో పోలీస్ వాళ్ళు ఈ డిఎన్ఏ పరీక్షా చెయ్యడం జరుగుతుంది .