వైసీపీ నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మళ్లీ టీడీపీలోకి వెళ్లనున్నారా అన్న చర్చలు జోరందుకొన్నాయి. ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేకుండానే సాగుతున్న సుబ్బారాయుడు... త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరే దిశగా కదులుతున్నారు. ఈ క్రమంలో తన సొంత జిల్లాకు చెందిన నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పరామర్శించారు అని కూడా ప్రచారం మొదలైంది. ఇటీవలే అనారోగ్యానికి గురైన రామా నాయుడు తన ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు ఆయనను పరామర్శిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తపల్లి సుబ్బారాయుడు బుధవారం నేరుగా పాలకొల్లు వెళ్లి, రామానాయుడును పరామర్శించారు. ఈ విషయాన్ని రామానాయుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సుబ్బారాయుడు... ఆ పార్టీలోనే ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మడి ఏపీ మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీల్లో చేరిన సుబ్బారాయుడు... మొన్నటిదాకా వైసీపీలో కొనసాగారు. 2024 ఎన్నికల్లో తాను తప్పనిసరిగా నరసాపురం నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానన్న విషయాన్ని మాత్రం చెప్పనని తెలిపారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణించిన వైసీపీ అధిష్ఠానం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa