నుపుర్ శర్మ పరారీలో ఉన్నారా అన్నది ఇపుడు ప్రధాన చర్చాంశనీయంగా మారుతోంది. నుపుర్ శర్మను అరెస్ట్ చేసేందుకు అవసరమైన బలమైన ఆధారాలను ముంబయి పోలీసులు సేకరించినట్టు మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. రజా అకాడమీ అనే ముస్లిం సంస్థ సంయుక్త కార్యదర్శి ఇర్ఫాన్ షేక్ ఫిర్యాదు మేరకు ముంబయిలో నుపుర్ శర్మపై కేసు నమోదైంది. అటు, కోల్ కతాలోనూ నుపుర్ పై ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి అబుల్ సోహైల్ ఫిర్యాదు మేరకు కోల్ కతా పోలీసులు ఇప్పటికే నుపుర్ కు సమన్లు జారీ చేశారు. ఈ నెల 20న హాజరుకావాలని ఆదేశించారు. ఢిల్లీలోనూ నుపుర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
మహ్మద్ ప్రవక్తపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ తీవ్ర దుమారానికి కారణమైన నుపుర్ శర్మ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిందన్న అభియోగాలపై ముంబయి పోలీసులు నుపుర్ శర్మపై కేసు నమోదు చేశారు. అయితే, ఆమెను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ వెళ్లిన ముంబయి పోలీసు బృందానికి నిరాశ ఎదురైంది. గత ఐదు రోజులుగా ముంబయి పోలీసులు ఢిల్లీలోనే మకాం వేసినా, ఇమె ఇప్పటిదాకా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.