ప్రస్తుతం కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తాను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేయలేనని జమ్మూ కశ్మీర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలో విపక్షనేతలు సమావేశమై రాష్ట్రపతి రేసులో ఫరూఖ్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీల పేర్లను ప్రతిపాదించారు.
అయితే, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా విముఖత వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనపై తాను నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేతలతోనూ, కుటుంబ సభ్యులతోనూ చర్చించానని ఫరూఖ్ అబ్దుల్లా వెల్లడించారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి వేళ తాను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేయలేనని స్పష్టం చేశారు. క్రియాశీలక రాజకీయాల్లో ఇంకా కొన్నాళ్లపాటు కొనసాగాల్సిన అవసరం కనబడుతోందని, విపత్కర పరిస్థితుల నుంచి జమ్మూ కశ్మీర్ ను బయటపడేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జమ్మూ కశ్మీర్ లో మెరుగైన పరిస్థితుల కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు.