బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం వంకాయలపాడుకు చెందిన కౌలు రైతు దంపతులు... అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగారు. వీరిలో భర్త మృతి చెందగా, భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. బాలినేని వినోద్ కుమార్ రెడ్డి అనే రైతు... నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని నాలుగేళ్లుగా సాగు చేస్తున్నారు. మిరప పంట వేయగా అధిక వర్షాలతో దెబ్బతింది. రెండో పంటగా వేరుశనగ పండించారు. అందులోనూ తీవ్ర నష్టం వచ్చింది. కుటుంబ పోషణ, పిల్లల చదువు భారంగా మారింది. అప్పులు తీర్చే మార్గం లేక భార్య అపర్ణప్రియతో కలసి వినోద్ కుమార్ రెడ్డి పురుగుమందు తాగారు. బంధువులు ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ వినోద్ కుమార్ రెడ్డి మృతిచెందారు. అపర్ణ మృత్యువుతో పోరాడుతున్నారు. మృతుడికి కౌలు రైతు కార్డు లేకపోవడంతో ఇటీవల ప్రకటించిన పంటల బీమాలోనూ పరిహారం అందలేదని బంధువులు తెలిపారు.