రెవ్లాన్ కాస్మోటిక్ కంపెనీ దివాళ తీసేదిశగా పయనిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీ యాజమాన్యమే అమెరికా కోర్టుకు తెలియజేసింది. రెవ్లాన్ కంపెనీ దశాబ్దాల కాలం పాటు కాస్మోటిక్ ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. కానీ, గురువారం ఈ కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటిస్తూ అమెరికాలోని కోర్టులో పత్రాలు సమర్పించింది. అయితే, మార్కెట్‌లో తమ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ''దశాబ్ధాలుగా మా ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చాం. ఈ ప్రకటన, వినియోగదారులకు ఐకానిక్ ఉత్పత్తులను అందించేందుకు రెవ్లాన్‌ను అనుమతిస్తుంది. అలాగే మా భవిష్యత్ వృద్ధికి స్పష్టమైన మార్గాన్ని కూడా కల్పిస్తుంది'' అని కంపెనీ సీఈవో డెబ్రా పెరెల్‌మన్ అన్నారు. కోర్టు నుంచి ఆమోదం లభించిన తర్వాత ఉత్పత్తిని కొనసాగించేందుకు తమ ఫైనాన్షియర్ల నుంచి 575 మిలియన్ డాలర్ల (రూ. 4,482 కోట్లు)ను వినియోగించుకుంటామని కంపెనీ ప్రకటించింది. సరఫరా వ్యవస్థలో అంతరాయం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి ప్రపంచ సవాళ్ల కారణంగా ద్రవ్య లభ్యతలో పరిమితులను ఎదుర్కొంటున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలోనే రెవ్లాన్ హెచ్చరించింది. మార్చి చివరి నాటికి కంపెనీకి 3.3 బిలియన్ డాలర్ల (రూ. 25,723 కోట్లు) దీర్ఘకాలిక అప్పు ఉంది. కంపెనీ దివాలాకు సంబంధించిన నివేదికలు రావడంతో గత వారం కంపెనీ షేరు ధర పడిపోయింది. ప్రస్తుతం 150కి పైగా దేశాల్లో రెవ్లాన్ ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. అయినప్పటికీ మార్కెట్‌లో దాని స్థానానికి దెబ్బపడింది. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా పేరు పొందిన ఈ కంపెనీ ర్యాంకు ఇప్పుడు 22వ స్థానానికి పడిపోయింది. రెవ్లాన్ పతనం 1990ల్లోనే ప్రారంభమైంది. మారుతోన్న వినియోగదారుల ప్రాధాన్యాలను అందిపుచ్చుకోవడంలో కంపెనీ విఫలం కావడంతో ఈ పతనం మొదలైంది. వినియోగదారులు కోరుకునే ప్రకాశవంతమైన ఎరుపు రంగు వైపు కాకుండా ముదురు రంగు లిప్‌స్టిక్ షేడ్స్ వైపే కంపెనీ మొగ్గింది.
రెవ్లాన్, ఎన్నో ఏళ్లుగా పోటీలో ఉన్న సంప్రదాయ ప్రత్యర్థులకు మాత్రమే కాకుండా ప్రముఖ వ్యక్తులు కొత్తగా ఏర్పాటు చేసిన ఫెంటీ బ్యూటీ, కైలీ కాస్మోటిక్స్ వంటి కొత్త బ్రాండ్‌లకు కూడా తమ మార్కెట్ షేరును కోల్పోతోంది. సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాల కారణంగా కాస్మోటిక్స్ తయారీలో వాడే పదార్థాలకు తీవ్ర పోటీ ఏర్పడిందని రెవ్లాన్ చెప్పింది. దీంతో ఆర్డర్ల కోసం ముందస్తుగా చెల్లింపులు జరపాలని పంపిణీదారులు విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితి, కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అవసరమైన వస్తువుల కొరతకు దారితీసిందని రెవ్లాన్ రీస్ట్రక్చరింగ్ డైరెక్టర్ రాబర్ట్ కరుసో, అమెరికా కోర్టులో దాఖలు చేసిన ఫైళ్లలో పేర్కొన్నారు. ''ఉదాహరణకు ఒక రెవ్లాన్ లిప్‌స్టిక్ తయారీకి 35 నుంచి 40 ముడి పదార్థాలు అవసరం. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకురాలేం'' అని ఆయన వాటిలో పేర్కొన్నారు. దీనితో పాటు కంపెనీ అమ్మకాలు 2020లో 21 శాతానికి పడిపోయాయి. గత ఏడాది 9.2 శాతం పుంజుకున్నప్పటికీ, కరోనా రాకముందు ఆదాయంతో పోలిస్తే ఇప్పుడు దాని ఆదాయం ఇంకా 2.4 బిలియన్ డాలర్లు (రూ. 18,708 కోట్లు) తక్కువగానే ఉంది.
1979లో పారిస్‌లోని రెవ్లాన్ స్టోర్. 1950ల్లో ఇది అంతర్జాతీయ బ్రాండుగా మారింది. రెవ్లాన్‌ను 1932లో చార్లెస్, జోసెఫ్ రావ్సన్ అనే సోదరులు చార్లెస్ లాచ్‌మన్‌తో కలిసి స్థాపించారు. వెంటనే ఈ కంపెనీ నెయిల్ పాలిష్‌లను అమ్మడం మొదలుపెట్టింది. 1950ల మధ్య నాటికి ఇది అంతర్జాతీయ బ్రాండుగా అవతరించింది. 1970లో నల్లజాతి మోడల్ అయిన సయోమి సిమ్స్‌ను కంపెనీ నియమించుకుంది. జాతి పరమైన అడ్డంకులను పట్టించుకోకుండా నల్లజాతి మోడల్‌ను నియమించుకున్న తొలి సౌందర్య కంపెనీగా రెవ్లాన్ పేరు పొందింది. ఆ తర్వాత సిండీ క్రాఫోర్డ్, క్లాడియా షిఫర్ వంటి మోడల్స్‌తో ప్రచార కార్యక్రమాలను రూపొందించి బ్యూటీ మార్కెట్‌ను షేక్ చేసింది. 1985లో ఈ కంపెనీని వందల కోట్లకు అధిపతి అయిన వ్యాపారవేత్త రోనాల్డ్ పారెల్‌మన్‌కు చెందిన మెకండ్రూస్ అండ్ ఫోర్బ్స్ కంపెనీ కొనుగోలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa