ప్రశ్నించే గొంతులను తట్టుకోలేక ఓ వాలంటీర్ వినూత్నంగా స్పందించాడు. తన చెప్పు తీసుకొని తనను తాను కొట్టుకొన్నాడు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ చెప్పుతో తనను తాను కొట్టుకున్నాడు. పంటల బీమా రాలేదెందుకని రైతులు నిలదీస్తుండటంతో ఆవేదనతో ఇలా చేశాడు. వాలంటీరుగా చేరినందుకు తనకు ఈ శాస్తి జరగాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశాడు. కదిరి మండలం రామదాస్ నాయక్ తండాలో నగేష్ నాయక్ గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్నారు. తన పరిధిలో 50 మంది రైతులతో ఈ-క్రాప్ బుకింగ్ చేయించగా.. వీరిలో ఒకరికి మాత్రమే పంటల బీమా వర్తించింది. మిగిలిన వారికి మాత్రం రాలేదు.
ఊళ్లో బీమా వర్తించని రైతులు నగేష్ను ప్రశ్నించారు. వారంతా నేరుగా రైతు భరోసా కేంద్రానికి వచ్చారు. బీమా విషయమై వాలంటీరుతో గొడవకు దిగారు. అక్కడే వ్యవసాయశాఖ అధికారి ఉన్నా సరే రైతులకు సమాధానం ఇవ్వలేకపోయారు. వాలంటీర్ కూడా సమస్యను అధికారికి వివరించారు. తాను మాత్రం బీమా ప్రక్రియ చేశానని.. 50 మంది రైతులకు ఈ-క్రాప్ చేయిస్తే.. ఒక్కరికే బీమా రావడం ఏంటని ప్రశ్నించారు. ఊళ్లోకి వెళితే తనను రైతులు చెప్పుతో కొట్టేలా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బదులు తన చెప్పుతో తాను కొట్టుకోవడం మేలని అంటూ.. తనను తాను చెప్పుతో కొట్టుకున్నాడు. వాలంటీర్ ఉద్యోగమే తనకు వద్దని.. రాజీనామా చేస్తానని అక్కడి నుంచి వెల్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.