అంతరిక్షంలో ప్రయాణమే ఓ సాహసంగా చెప్పవచ్చు. కానీ అలాంటి అంతరిక్షంలో ఎవరైనా ఫీట్లు చేస్తారా..? కాస్త ఎత్తుపై నుంచి తొంగి చూస్తేనే గుండెలు జారిపోతాయి. భవనంపై సురక్షితంగా ఉన్నా అంత భయం మరి. ఇక విమానం నుంచో, హెలికాప్టర్ నుంచో ప్యారాచూట్ కట్టుకుని దూకేవాళ్లూ ఉంటారు. కానీ భూమికి వందల కిలోమీటర్ల ఎత్తున అంతరిక్షంలో ఎలాంటి ఆధారం లేకుండా తేలిపోతూ ఉంటే.. అమ్మో అనిపిస్తుంది కదా. 1984లో నాసా నిర్వహించిన చాలెంజర్ స్పేస్ షటిల్ ప్రయోగ సమయంలో మెక్ క్యాండెలెస్ అనే వ్యోమగామి అలా చాలాసేపు తేలిపోయాడు.
సాధారణంగా అంతరిక్ష ప్రయోగాల్లో స్పేస్ షటిల్ దాటి బయటికి వచ్చే వ్యోమగాములు.. పెద్ద తాడు వంటిది కట్టుకుని ఉంటారు. ఎందుకంటే.. ఒక్కసారి అంతరిక్షంలో దూరంగా జారి వెళ్లిపోతే ఇక అంతే. మళ్లీ దొరకడం కష్టం. అలా భూమి చుట్టూ తిరుగుతూనే ఉండిపోవడమో, కొంతకాలం తర్వాత భూమిపైకి రాలి పడిపోవడమో జరుగుతుంది.
కానీ మెక్ క్యాండెలెస్ మాత్రం ప్రత్యేకమైన స్పేస్ సూట్ ధరించి అలా దూరంగా వెళ్లగలిగాడు. ఎందుకంటే అంతరిక్షంలో కాస్త దూరం ప్రయాణించగల పరికరాలు ఆ స్పేస్ సూట్ లో ఉన్నాయని నాసా ప్రకటించింది. ఇలా తాడు లేకుండా స్పేస్ లోకి వెళ్లిన మొదటి వ్యోమగామి కూడా ఆయనేనని తెలిపింది.
1984 నాటి ఈ ఫొటోను తాజాగా ప్రఖ్యాత ‘సైన్స్ నేచర్’ వెబ్ సైట్ ట్విట్టర్ లో పోస్టు చేయగా ట్రెండింగ్ గా మారింది. ఒక్కరోజులోనే లక్షన్నరకుపైగా లైక్ లు వచ్చాయి. వేల మంది షేర్ చేశారు.
దీనికి ‘ఇప్పటివరకు అంతరిక్షానికి సంబంధించిన ఫొటోల్లో ఇదే ఎక్కువ భయపెడుతోంది..’ అని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేయడం గమనార్హం.
చిత్రమేమిటంటే.. మెక్ క్యాండెలెస్ అలా బయటికి వెళ్లినప్పుడు చాలెంజర్ స్పేస్ షటిల్, ఆయన కూడా గంటకు 25వేల కిలోమీటర్లకుపైగా వేగంతో ఉన్నారని నాసా తెలిపింది.