మొన్నటి వరకు ఆకాశనంటిన వస్తువల ధరలలో అయిల్ కూడా ఒకటి. తాజాగా అయిల్ ధరలు తగ్గివస్తున్నాయి. కానీ పెరిగిన ఇతర వస్తువుల ధరల సంగతి ఏమిటీ అన్నది సామాన్యుడి మదిలో తొలిచే ఆలోచన. ఇదిలావుంటే ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించడంతో.. వంటనూనెల ధరలు దిగొస్తున్నాయి. ఎడిబుల్ ఆయిల్ ధరలను తగ్గిస్తున్నట్టు వంటనూనెల తయారీ కంపెనీలూ ప్రకటిస్తున్నాయి. బ్రాండెడ్ వంటనూనెల తయారీదారులు పామాయిల్ వంటి పలు వంటనూనెలపై ధరలు తగ్గించాయి. ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించడంతో ఈ ధరలు లీటరుపై రూ.15 నుంచి రూ.20 మేర తగ్గాయి. ఈ నూనెలను షాంపులు, బిస్కెట్లు, సోపుల తయారీలో వాడతారు. ఫుడ్ ప్రొడక్టులు, బయోఫ్యూయల్స్, కాస్మోటిక్స్ వంటి వంటిల్లో పామాయిల్, దాని సంబంధిత పదార్థాలను వాడతారు. పామాయిల్ ధరలు పెరిగిన ప్రతిసారీ ఈ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలకు ఇన్‌పుట్ ఖర్చులు పెరిగి, ధరలు పెంచాయి. కానీ ప్రస్తుతం పామాయిల్ ధరలు తగ్గాయి. కానీ కంపెనీలు మాత్రం ధరలు తగ్గించేందుకు సముఖంగా లేవు. తాము ధరలు తగ్గించమని, కానీ ధరల పెంపుదల వేగాన్ని మాత్రం కాస్త తగ్గిస్తామని చెబుతూ కస్టమర్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.
అయితే వంటనూనెల ధరలు తగ్గుతుండటంతో.. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీలు కూడా సోపుల, షాంపుల ధరలు తగ్గిస్తాయని ఆశపడుతోన్న కస్టమర్లకు, కంపెనీలు షాకింగ్ న్యూసే చెప్పాయి. తాము ధరలు తగ్గించడం లేదని ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్రకటిస్తున్నాయి. ధరలు తగ్గించమని, కానీ ధరల పెంపుదల వేగాన్ని మాత్రం తగ్గిస్తామని చెబుతున్నాయి.
క్రూడ్ పామాయిల్ బేస్ దిగుమతి ధర టన్నుకు 1,620 డాలర్లు పలుకుతోంది. అలాగే ఆర్‌బీడీ పామాయిల్, ఆర్‌బీడీ పామోలిన్ ధరలు కూడా టన్ను 1,757 డాలర్లకు, 1,767 డాలర్లకు పడిపోయాయి. క్రూడ్ సోయా ఆయిల్ బేస్ ఇంపోర్టు ధర కూడా టన్ను 1,831 డాలర్లకు దిగొచ్చింది. వంటనూనెల ధరలు తగ్గుతుండటంతో ధరల పెంపుదల తగ్గుతుందని, కానీ ధరలు తగ్గవని విప్రో కన్జూమర్ కేర్, లైటింగ్(కన్జూమర్ కేర్ బిజినెస్‌ల) ప్రెసిడెంట్ అనిల్ ఛుంగ్ చెప్పారు. పెరిగిన కమోడిటీ ధరల భారాన్ని తాము సగం మాత్రమే కస్టమర్లకు బదలాయించామని, మిగిలిన మొత్తం తామే భరించామని, ఖర్చులను తగ్గించుకున్నామని, మార్జిన్లను పోగొట్టుకున్నామని తెలిపారు.