ఎదుగు..బోదుగు లేని జీతాలతో కాలం వెలదీస్తున్న ఈ రోజుల్లో ఐటీసీ కంపెనీ తన ఉద్యోగులకు పెద్ద మొత్తంలో జీతాలు చెల్లిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఐటీసీ కంపెనీయే తెలిపింది. ఐటీసీ కంపెనీ ఉద్యోగుల వేతనాలు ఇతర కంపెనీలతో పోలిస్తే భారీ స్థాయిలో ఉన్నాయి. కోటికి పైగా వేతనాన్ని పొందే ఉద్యోగుల సంఖ్య 2021-22 ఆర్థిక సంవత్సరంలో 44 శాతం పెరిగింది. అంటే ఈ ఉద్యోగులు నెలకు సగటును రూ.8.5 లక్షలు జీతం తీసుకుంటున్నారు. ఈ విషయం కంపెనీ ఇటీవల విడుదల చేసిన వార్షిక రిపోర్టులో వెల్లడించింది. ఐటీసీ కంపెనీ విడుదల చేసిన వార్షిక రిపోర్టులో 2021 ఆర్థిక సంవత్సరంలో కోటికి పైగా వేతనాన్ని పొందే ఉద్యోగులు తమ కంపెనీలో 153 మంది ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 220కి పెరిగినట్టు తెలిపింది.
ఏడాదంతో కంపెనీలో పనిచేసిన 220 మంది ఉద్యోగులు రెమ్యూనరేషన్‌లో భాగంగా 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.102 లక్షలను లేదా అంతకంటే ఎక్కువగా పొందినట్టు కంపెనీ తన వార్షిక రిపోర్టులో తెలిపింది. అంటే నెలకు సగటును వీరు రూ.8.5 లక్షల జీతం తీసుకున్నట్టు పేర్కొంది.
ఐటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పురి జీతం 2022 ఆర్థిక సంవత్సరంలో 5.35 శాతం పెరిగి రూ.12.59 కోట్లకు చేరుకుంది. దీనిలో రూ.2.64 కోట్ల కన్సాలిడేటెడ్ వేతనం, రూ.49.63 లక్షల జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు, రూ.7.52 కోట్ల పనితీరు ఆధారిత బోనస్‌లు కలిసి ఉన్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో పురి స్థూల పరిహారాలు రూ.11.95 కోట్లుగా ఉన్నాయి.
ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ సుమంత్, ఆర్ టాండన్‌లు స్థూల వేతనం కింద రూ.5.76 కోట్లను, రూ.5.60 కోట్లను పొందారు. మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి ఐటీసీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 23,829గా ఉంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య 8.4 శాతం తక్కువ. కంపెనీ ఉద్యోగులలో 21,568 మంది పురుషులు కాగా.. 2,261 మంది మహిళా ఉద్యోగులు. ఐటీసీ స్థూల ఆదాయాలు మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.59,101 కోట్లకు పెరిగాయి.