పట్టణాల్లో ఇళ్లులేని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి, పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ పత్రాలను చేతికి అందిస్తానన్న సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ సాకారమవుతోంది. విజయనగరానికి సమీపంలోని సారిపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ఏపీ టౌన్‌షిప్ ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో జగనన్న కాలనీ సిద్ధమైంది. 800 ఇళ్లను జిల్లా ఇన్‌చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ గురువారం ప్రారంభించారు. ఆయా లబ్ధిదారులకు ఇంటిపత్రాలను అందించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుపేదల కోసం ప్రభుత్వం నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్ద జి+3 విధానంలో రూ.161.52 కోట్ల వ్యయంతో 2,656 ఇళ్ల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. వాటిలో ఏ–కేటగిరిలో 300 చదరపు అడుగుల చొప్పున విస్తీర్ణంతో 1,536 ఇళ్లు, బి–కేటగిరీలో 365 చదరపు అడుగుల విస్తీర్ణంతో 192 ఇళ్లు, సి–కేటగిరీలో 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో 928 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్నాయి. వాటిలో అన్ని రకాల సౌకర్యాలతో సిద్ధమైన 800 ఇళ్లను లబ్ధిదారులకు మంత్రుల చేతుల మీదుగా అందించారు.