అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తానని ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారురు. ఉప ఎన్నిక చాలా పారదర్శకంగా జరిగిందని, సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలే తన గెలుపునకు కారణమని వివరించారు. ఏపీ సీఎం జగన్ పట్ల ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే మేకపాటి విక్రమ్ రెడ్డి 82 వేలకు పైగా ఓట్లతో భారీ మెజారిటీ సాధించారు. మొత్తం 20 రౌండ్ల పాటు ఓట్లు లెక్కించగా, ఏ రౌండ్ లోనూ ఆయన వెనుకబడింది లేదు. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యం నిలుపుకుంటూ వచ్చారు.
విజయం సాధించిన అనంతరం మేకపాటి విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు. తమ కుటుంబంపై మరోసారి నమ్మకం ఉంచినందుకు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.
సంక్షేమ పథకాలు మునుపెన్నడూ లేనంత గొప్పగా అమలవుతున్నాయని, సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలే విజయానికి కారణం అని విక్రమ్ రెడ్డి తెలిపారు. మహానేత వైఎస్సార్ ను మరిపింపజేసేలా పరిపాలన సాగిస్తున్నారనంటూ సీఎం జగన్ ను కొనియాడారు. జగన్ సమర్థ నాయకుడు అని, అలాంటి వ్యక్తి నాయకత్వం రాష్ట్రానికి అవసరం అని ఉద్ఘాటించారు.