జనసేన పార్టీ కార్యక్రమాల అమలు, నిర్వహణలో నాయకులు, శ్రేణులు సమన్వయంతో ముందుకు వెళ్తేనే సత్ఫలితాలు వస్తాయని పార్టీ అధ్యకులు పవన్ కళ్యాణ్ రు తెలిపారు. సైద్ధాంతిక విలువలతో కూడిన పార్టీ జనసేన అనే విషయాన్ని నాయకులు ఎప్పుడూ మదిలో ఉంచుకోవాలని.. పార్టీకి బలంగా నిలిచే కార్యకర్తలను విస్మరించవద్దని చెప్పారు. పార్టీ నియమావళి, నిబంధనలను నాయకుల నుంచి కార్యకర్తల వరకూ ప్రతి ఒక్కరూ పాటించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణకు సంబంధించిన ఈ అంశాలను నిశితంగా పరిశీలన చేసి, ఎవరూ నియమావళిని, నిబంధనలను ఎవరూ అతిక్రమించకుండా చూడాలని పార్టీ ముఖ్య నేతలకు స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గత అయిదు రోజులుగా వరుస సమీక్షలు, భేటీలు నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. నాయకుల మధ్య, శ్రేణుల మధ్య కొన్ని సందర్భాల్లో భావ వైరుధ్యాలు ఉండవచ్చు.... అవేవీ పార్టీ మూల సూత్రాలు, సిద్ధాంతాలకు భిన్నంగా, పార్టీ ప్రయోజనాలకు, అంతిమ లక్ష్యానికి విఘాతం కలిగించేవిగా ఉండకూడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విధివిధానాలు, నియమాలు, నియమావళికి విరుద్ధంగా ఏవైనా పరిణామాలు చోటు చేసుకున్న పక్షంలో పార్టీ అంతర్గతంగా పరిశీలన చేసి, ఆ పరిణామాలను విచారించేందుకు కమిటీని నియమించి దిద్దుబాటు చర్యలు చేపడతామన్నారు. క్రమశిక్షణ అలవరిచే ఈ ప్రక్రియను పారదర్శకంగా పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నామన్నారు.