గుంటూరులో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ ప్రాంగణం ఏర్పాట్లను పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి సుచరిత, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 2017లో ఇదే ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించింది. ఆ ప్లీనరీ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ సీపీ 151 స్థానాలతో అఖండ విజయం సాధించి, అధికారాన్ని చేజిక్కించుకుంది. మళ్ళీ, అయిదేళ్ల తర్వాత 2022లో జులై 8,9 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. మహానేత వైయస్ఆర్ జయంతి జులై 8వ తేదీ కావడం, అదే రోజున పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. మళ్లీ అయిదేళ్ల తర్వాత, అంటే 2027లో కూడా అధికారంలో ఉండే మా పార్టీ, అప్పుడు కూడా ప్లీనరీ సమావేశాలు ఘనంగా నిర్వహించుకుంటాం. ఎంతో మనోధైర్యంతో ఈ విషయాన్ని చెబుతున్నాం. మాది ఒకటే సిద్ధాంతం. మా పార్టీ నాయకులంతా ఏకతాటిపై నడిచి విజయాలను సాధిస్తాం అని జోస్యం చెప్పారు.