కావలసిన పదార్ధాలు: పెరుగు - 2 కప్పులు, కొబ్బరి కాయ -1, ఆవాలు - 1స్పూన్, జీలకర్ర - 1స్పూన్, పచ్చిశనగపప్పు - 1 స్పూన్, సాయి పెసరపప్పు - 1స్పూన్, ఎండుమిర్చి - 3, చిన్నుల్లి -2, కరివేపాకు - 1 రెబ్బ, కొత్తిమీర తురుము - కొద్దిగా, అల్లం - చిన్నముక్క, పచ్చిమిర్చి - 2, నూనె - సరిపడా, ఉప్పు-రుచికి సరిపడా, పసుపు - చిటికెడు.
తయారీవిధానం:
--- ఈ రెసిపికి కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగైతే చాలా రుచిగా ఉంటుంది. ఉప్పు వేసిన పెరుగును కవ్వంతో చిలికి పక్కన పెట్టండి.
--- కొబ్బరికాయను కొట్టి కొబ్బరిని చిన్న ముక్కలుగా కొయ్యండి. అల్లం పై తోలు తీసి చిన్న ముక్కలుగా కొయ్యండి.
--- ఇప్పుడు కొబ్బరి, అల్లం ముక్కలను మిక్సీ జార్ లోకి తీసుకుని, అందులోనే తొడిమలు తీసిన పచ్చిమిర్చిని, కొద్దిగా నీళ్లను వేసి మెత్తని మిశ్రమంలా గ్రైండ్ చెయ్యండి.
--- ఈ మిశ్రమాన్ని ఇందాక చిలికిన పెరుగులో వేసి బాగా కలపండి. మరీ పల్చగా కాకుండా, కొద్దిగా చిక్కగా ఉండేలా చూసుకుంటే టేస్ట్ బావుంటుంది.
--- ఆపై స్టవ్ ఆన్ చేసి చిన్న బాండీ పెట్టుకుని తాలింపుకు సరిపడా నూనె వేసి కాగబెట్టండి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పెసరపప్పు ఒక్కోస్పూన్ చొప్పున వేసుకుని దోరగా వేగాక పసుపు, ఎండుమిర్చిని రెండు సగాలుగా చేసి అందులో వెయ్యండి. అదికూడా బాగా వేగాక కరివేపాకు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చెయ్యండి.
--- ఈ తాలింపును పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకుని కొద్దిగా కొత్తిమీర తురుమును జోడిస్తే, రుచికరమైన కొబ్బరి మజ్జిగపులుసు రెడీ అయినట్టే.