టీడీపీ నేతల విమర్శలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు కూడా చేస్తున్నానని ఆయన వెల్లడించారు. ఈ మేరకు నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోటంరెడ్డి తన వ్యాపారాలపై కుండబద్దలు కొట్టేశారు. రాజకీయ దందాలు చేస్తే తప్పు గానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేముందని కూడా ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉంటే వ్యాపారం చేయకూడదా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో పాటు పొరుగునే ఉన్న సూళ్లూరుపేట, తిరుపతి, తమిళనాడులోని తిరువళ్లూరు, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోనూ తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని ఆయన వెల్లడించారు. వ్యాపారస్తులను వేధిస్తే తప్పు గానీ వ్యాపారం చేస్తే తప్పేముందని కూడా ఆయన టీడీపీ నేతలను నిలదీశారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు కాంట్రాక్టులు కూడా చేస్తున్నానని ఆయన వెల్లడించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో పాటు మైసూర్, తమిళనాడుల్లోనూ తాను కాంట్రాక్టులు చేస్తున్నానన్న కోటంరెడ్డి... సబ్ కాంట్రాక్టులు కూడా చేస్తున్నానని తెలిపారు. తాను వ్యాపారం చేయలేదని ఏనాడూ చెప్పలేదని కూడా ఆయన తెలిపారు.