ఏ అవగాహన కార్యక్రమం చేపట్టినా సామాన్యుడి మెదడును సైతం రంజింప జేయాలి. అపుడే ఏ అంశంపై అవగాహన చేపడుతున్నారో ప్రజలకు అర్థమవుతోంది. ఇకపోతే సాధారణంగా ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేశాక బిల్లు కట్టడం తప్పనిసరి. బిల్లు అంటే నేరుగా నగదు ఇవ్వడమో, ఏదైనా క్రెడిట్, డెబిట్ కార్డుతో చెల్లించడమో, స్కాన్ చేసి పే చేయడమో ఉంటుంది. కానీ ఓ రెస్టారెంట్ లో మాత్రం ఇవేమీ అక్కర్లేదు. కేవలం ప్లాస్టిక్ వేస్ట్ ఇస్తే చాలు. మీకు కావాల్సింది తినేసి వెళ్లిపోవచ్చు. ఇదేదో బాగుంది కదా.. గుజరాత్ లోని జూనాగఢ్ లో ఈ రెస్టారెంట్ ను తెరిచారు. దీనికి పెట్టిన పేరు ఏమిటో తెలుసా.. ‘నేచురల్ ప్లాస్టిక్ కేఫ్’.
ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలుగుతున్న హానిపై అవగాహన కల్పించడం కోసం జూనాగఢ్ లో ఈ కేఫ్ కం రెస్టారెంట్ తెరిచారు. ప్లాస్టిక్ తీసుకుంటున్నారు కదా అని ఏవో కొన్ని రకాల ఫుడ్ ఇస్తారనుకుంటే పొరపాటే. అక్కడ దొరికే ప్రతి ఫుడ్ ఐటమ్ కు కూడా డబ్బులకు బదులు తగినంత ప్లాస్టిక్ వేస్ట్ ను ఇవ్వొచ్చు. దీనితో స్థానికంగా ఉన్న జనం ప్లాస్టిక్ వేస్ట్ తో రెస్టారెంట్ ముందు క్యూ కడుతున్నారు. ఈ కేఫ్ లో గుజరాతీ వంటకాలైన సేవ్ టమేటా, బైంగన్ భర్తా, థేప్లా, బజ్రా రోట్లా వంటివి లభిస్తాయని నిర్వాహకులు చెప్తున్నారు.
ఈ ప్లాస్టిక్ కేఫ్ గురించి తెలిసిన జూనాగఢ్ కలెక్టర్ దాని నిర్వాహకులను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్ల నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. ‘ప్లాస్టిక్ ప్రమాదంపై అవగాహన కోసం ఇలాంటివి ఏర్పాటు చేయడం బాగుంది..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.