ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై భగ్గుమంటున్న విపక్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 03, 2022, 03:38 PM

ఆర్టీసీ  ఛార్జీలను భారీగా పెంచడంపై ఏపీలోని విపక్షాలు భగ్గుమంటున్నాయి. రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు ఛార్జీలు  పెంచడమా అని నిలదీస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు మహిళ అధ్యక్షురాలు జగన్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ట్విట్టర్‌లో సెటైర్లు పేల్చారు. ‘జగన్ రెడ్డి అక్క చెల్లెమ్మలకు అస్సలు ద్రోహం చేయడు. ఓ పక్క అమ్మ ఒడి బటన్ నొక్కాను అంటూనే గ్యాప్ ఇవ్వకుండా ఆర్టీసీ ఛార్జీలు మూడో సారి బాదేసాడు. ఎకౌంట్లో వేయడానికి ఒక్క బటన్.. ఎకౌంట్ల లోది గుంజడానికి పది బటన్లు పెట్టుకున్నాడు. మూడేళ్ళలో 3 సార్లు బాదడం ఓ రికార్డ్. #BadudeBaduduByJagan’అంటూ టార్గెట్ చేశారు.


ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. ఏపీఎస్‌ఆర్టీసీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డీజిల్‌ సెస్‌ పెంపు వల్ల ఛార్జీలు పెంచక తప్పలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలో రెండో సారీ ఛార్జీలు పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు విజయవాడలో ఆందోళనకు దిగాయి. బస్టాండు ప్రధాన ద్వారం వద్ద చేపట్టిన ధర్నాలో సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత మధు, నేతలు పాల్గొన్నారు.


జగన్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో పాలన చేస్తుందని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీ ఛార్జీలు పెంచారని.. రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి 2 వేల కోట్ల భారం మోపారని.. పల్లె వెలుగు బస్సు ఛార్జీలు కూడా పెంచడం దారుణమన్నారు. అటు విద్యుత్ ఛార్జీలు పెంపుతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని.. త్వరలోనే కలిసి వచ్చే అన్ని పార్టీలతో పోరాటం చేస్తామన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల పై భారాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు నేతలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com