మొన్నటి వరకు మహారాష్ట్ర సీఎం ఎవరూ అన్న ఉత్కంఠ సాగగా తాజాగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం నిర్ణయాలతో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఉద్ధవ్ థాక్రేకు మరో షాక్ తగిలింది. శివసేన నేతలు విధాన్ భవన్లోని శాసన సభాపక్ష కార్యాలయాన్ని సీల్ చేశారు. సంబంధిత తలుపులపై ఓ నోటీసును కూడా అంటించారు. ఆ నోటీసులో "శివసేన శాసనసభా పక్షం సూచనల మేరకు కార్యాలయం మూసివేయబడింది" అని మరాఠిలో రాసి ఉంది.
మరోవైపు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వం బల నిరూపణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజైన ఆదివారం స్పీకర్ ఎన్నిక జరిగింది. బీజేపీ తరఫున బరిలో నిలిచిన రాహుల్ నర్వేకర్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తాత్కాలిక స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు.