బ్యాంకులు తమ కస్టమర్లను కాపాడుకొనేందుకు తమ డిపాజిటర్లకు వడ్డీ రేట్లు పెంచి ఇస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా వచ్చి చేరింది. ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్ల కంటే తక్కువగా ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు పీఎన్‌బీ ప్రకటించింది. పెంచిన వడ్డీ రేట్లు నేటి నుంచే(జూలై 4, 2022) అమల్లోకి వచ్చాయని బ్యాంకు తెలిపింది. అడ్జెస్ట్‌మెంట్ తర్వాత.. ఏడాది నుంచి రెండేళ్లు, మూడేళ్ల వరకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకు వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్ల నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు పెరిగాయి.
7 రోజుల నుంచి 45 రోజుల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకు 3 శాతం వడ్డీ రేటునే అందిస్తోంది. అలాగే 46 రోజుల నుంచి 90 రోజుల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 3.25 శాతం వడ్డీ రేటును బ్యాంకు ఆఫర్ చేస్తుంది. 180 రోజుల నుంచి ఏడాది లోపల మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీలు ఖాతాదారులకు లభిస్తాయి. 91 రోజుల నుంచి 179 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4 శాతంగా ఉంది. ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై పీఎన్‌బీ ప్రస్తుతం 5.30 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. ఈ వడ్డీ రేటు 5.20 శాతం నుంచి 5.30 శాతం పెరిగింది. రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 5.30 శాతం నుంచి 5.50 శాతం పెరిగింది. అంటే 20 బేసిస్ పాయింట్ల మేర ఈ వడ్డీ రేటు ఎగిసింది. మూడేళ్ల పైబడి, ఐదేళ్ల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.50 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 5.60 శాతం వడ్డీ రేటు లభిస్తాయి. 1111 రోజుల కాలానికి బ్యాంకు యూనిక్‌గా 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
సీనియర్ సిటిజన్లకు పీఎన్‌బీ అదనంగా 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది. అయితే బ్యాంకు ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన స్టాఫ్ మెంబర్లు సీనియర్ సిటిజన్లు అయితే ఈ వడ్డీ రేటు అసలు రేటుకు 150 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంటుంది. పీఎన్‌బీ ట్యాక్స్ సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌కి ఇది వర్తించదు.
పీఎన్‌బీ ఉత్తమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో ఇన్వెస్టర్లకు రూ.15 లక్షలకు పైగా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్పెషల్ డిపాజిట్ స్కీమ్‌ను బ్యాంకు ఆఫర్ చేస్తుంది. ఈ డిపాజిట్ స్కీమ్ కాల వ్యవధి 91 రోజుల నుంచి 1111 రోజుల వరకు ఉంటుంది. వడ్డీ రేట్లు 4.05 శాతం నుంచి 5.55 శాతం మధ్యలో ఉన్నాయి.