దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్నటి రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు ముంబై శివారు ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సియోన్, పరేల్, బాంద్రా, కుర్లా, ఘట్‌కోపర్, చెంబూర్, శాంతాక్రూజ్, అంధేరి, మలాడ్ మరియు దహిసర్‌తో సహా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్లు నీట మునిగాయి.
ముంబైలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలను నగరంలో మోహరించినట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం ముంబైలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా నగరంలోని సియోన్ లో జనజీవనం స్తంభించింది. నవీ ముంబైలోని ఖండేశ్వర్ రైల్వే స్టేషన్ నీటమునిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే ముంబైతోపాటు పొరుగు జిల్లాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.