గతంలో కొవిడ్ కారణంగా ఆంక్షలతో భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం భారీగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. తిరుమలలో క్రమంగా ఆంక్షల ఎత్తివేయడంతో రెండేళ్లుగా వేచిచూస్తున్న భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వస్తున్నారు. దీనికి తోడు వేసవి సెలవులు కూడా కావడంతో భక్తులు రద్దీ అమాంతం పెరిగిపోయింది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా బాగా పెరిగింది.
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం దుమ్ము దులిపింది. టీటీడీ చరిత్రోనే తొలిసారి వెంకన్న హుండీ ఆదాయం కొత్త రికార్డు సృష్టించింది. కొండకు భక్తులు పోటెత్తడటంతో ఆదాయం పెరిగింది. ఒక్కరోజే ఏకంగా రూ.6 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు టీటీడీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.. విరాళాలు రూ.6.18 కోట్లుగా తెలిపింది. ఇప్పటిదాకా 2012 ఏప్రిల్ 1న తిరుమల వెంకన్న హుండీకి ఒకరోజు అత్యధికంగా లభించిన ఆదాయం రూ.5.73 కోట్లు. ఇప్పుడు మొట్టమొదటిసారి రూ.6 కోట్ల మార్క్‌ను దాటింది.. ఇప్పుడు 2012 రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించింది.
ప్రతి నెలా శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతోంది. టీటీడీ (TTD) లెక్కల ప్రకారం శ్రీవారి హుండీ ఆదాయం గత నాలుగు నెలలుగా ప్రతి నెలా రూ.100 కోట్లు పైమాటే ఉంది. గతంలో ఎప్పుడూ ఎరుగని రీతిలో ఒక్క మే నెలలోనే శ్రీనివాసుడి ఖాతాలో అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం రావడ విశేషం. రెండు నెలలుగా కొండ భక్తులతో కిటకిటలాడింది. ఈ ఏడాది మార్చి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.128 కోట్లు.. అదే ఏప్రిల్‌లో రూ.127.5 కోట్లు వచ్చింది. జూన్ నెలలో కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. జూన్ మాసంలో కూడా 120 కోట్లు పైగా హుండీ ద్వారా ఆదాయం వచ్చిందని చెబుతున్నారు.