ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకిన వంటనూనెల ధరలు క్రమంగా తగ్గివస్తున్నాయి. తాజాగా మరోసారి వంట నూనే ధరలు తగ్గనున్నాయి. మలేసియా ఎక్స్చేంజ్‌లో ధరలు తగ్గడం వల్ల ఆయిల్ సీడ్స్ ధరలు మన దేశంలోనూ దిగివచ్చాయి. మాలేసియా ఎక్స్చేంజ్‌లో సోమవారం ఆయిల్ సీడ్స్ ధరలు దాదాపు 8 శాతం తగ్గాయని ట్రేడర్లు పేర్కొంటున్నారు. చికాగో ఎక్స్చేంజ్ సోమవారం క్లోజ్‌లో ఉంది. ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు భారీగా పడిపోవడం వల్ల మరీముఖ్యంగా దిగుమతి చేసుకున్న ఆయిల్స్ (సోయాబీన్ దెగుమ్, సీపీవో, పామోలిన్) ధరలు బాగా తగ్గాయి. గత నెల రోజుల్లో చూస్తే వీటి ధరలు 35 నుంచి 40 శాతం మేర క్షీణించాయి. డొమెస్టిక్ ఆయిల్ రేట్లు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే దిగుమతి చేసుకున్న ఆయిల్స్‌తో పోలిస్తే దేశీ మార్కెట్‌లో ఆయిల్ రేటు స్వల్పంగానే తగ్గిందని చెప్పుకోవచ్చు.
విశ్వసనీయ వర్గాల ప్రకారం చూస్తే.. కాటన్ సీడ్ వ్యాపారం దాదాపు ముగింపునకు వచ్చేసింది. గుజరాత్‌లోని పలు కంపెనీలు, కన్సూమర్లు కాటన్ సీడ్స్ కొరత ప్రభావాన్ని వేరుశనగతో తగ్గించుకుంటున్నారు. దీని వల్ల వేరుశనగ నూనె, ఆయిల్ సీడ్స్ ధరలు పైస్థాయిలోనే కదలాడుతున్నాయి. మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే దిగుమతిదారులు విక్రయించాల్సి వస్తోందని, దీంతో వారు ఇబ్బందుల్లో ఉన్నారని తెలుస్తోంది. సోమవారం నాటి తగ్గుదల వీరిపై మరింత ప్రభావం చూపుతోంది.
కేంద్ర ప్రభుత్వం దిగుమతిదారులకు ఏడాదిలో 2 మిలియన్ టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్, 2 మిలియన్ టన్నుల సోయాబీన్ ఆయిల్‌ను సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. దీంతో చాలా మంది ఈ ఆయిల్స్‌ను దిగుమతి చేసుకున్నారు. అయితే ఇప్పుడు వీటి ధరలు తగ్గుతున్నాయి. అలాగే మరోవైపు ఆవాల లభ్యత కూడా తగ్గిపోయింది.