పైలేట్ల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి దుబాయ్ కు బయల్దేరిన స్పైస్ జెట్ విమానం పాకిస్థాన్ లోని కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్యాసింజర్లంతా సురక్షితంగా ఉన్నారని స్పైస్ జెట్ తెలిపింది. ఫ్యూయల్ లికేజీని గుర్తించకపోయివుంటే జరిగే నష్టం భారీగానే ఉండేదని తెలుస్తోంది. ఫ్యూయల్ లీకేజీ అవుతుంటే తెలియజేసే లైట్ ఇండికేటర్లు విమానంలో ఉంటాయి. ఈ ఇండికేటర్లు సరిగా పని చేయకపోవడంతో ఫ్యూయల్ లీక్ అవుతోందని పైలట్లు భావించారు. ఫ్యూయల్ క్వాంటిటీ అసాధారణంగా తగ్గిపోతున్నట్టు వారు గుర్తించారు. దీంతో, కరాచీలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు ఈ సందర్భంగా స్పైస్ జెట్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, 'ఫ్యూయల్ ఇండికేటర్ లైట్ సరిగా పని చేయకపోవడంతో స్పైస్ జెట్ బీ737ను కరాచీకి మళ్లించి, ల్యాండ్ చేశాం. కరాచీలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్యాసింజర్లు అందరూ క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ఎమర్జెన్సీని ప్రకటించలేదు. విమానం నార్మల్ గానే ల్యాండింగ్ అయింది. ఇంత వరకు ఈ విమానానికి ఎలాంటి సమస్య తలెత్తలేదు. ప్రయాణికులకు రిఫ్రెష్ మెంట్స్ అందించాం. మరో విమానాన్ని కరాచీకి పంపించాం. ఆ విమానం కరాచీ నుంచి ప్రయాణికులను తీసుకుని దుబాయ్ కు వెళ్తుంది' అని చెప్పారు.