అతి నిద్ర వల్ల జరిగే నష్టం అంతాఇంతా కాదు. తక్కువ నిద్రపోయేవాళ్లే కాదు ఎక్కువ నిద్రపోయేవారు డిప్రెషన్ బారిన పడతారు. మెదడులోని కణాలూ బలహీనమైపోతాయి. గర్భధారణలోనూ సమస్యలు ఎదురవుతాయి. గుండె ధమనులు దెబ్బతింటాయి. షుగర్‌తో పాటు హృదయ సంబంధ అనారోగ్య సమస్యలకూ అతి నిద్ర కారణమవుతుందట. ఎక్కువ నిద్రపోవడం వల్ల ఇన్ని రకాల నష్టాలు ఉన్నాయి. మరి అసలు ఎంతసేపు నిద్రపోవాలి? అనే విషయం మీదా సంశయాలు ఉన్నాయి. అది ఎవరికి వారికి వారి శారీరక, మానసిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. సాధారణ మనిషికి ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర సరిపోతుంది.
అనారోగ్యాల బారిన పడినప్పుడు, దీర్ఘకాల రోగాలు వేధిస్తున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ విశ్రాంతి అవసరమవుతుంది. మనిషి ఆరోగ్యకరంగా ఉండాలంటే రోజులో ఏడెనిమిది గంటలకు తక్కువ, తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్ర పోకూడదు. నిద్ర వేళలు తరిగినా, పెరిగినా కూడా సమస్యే. ఎక్కువ సేపు నిద్రపోతే డిప్రెషన్ ముప్పు 49 శాతం ఎక్కువ ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఇదొక్కటే కాదు మెదడు పనితీరూ దెబ్బతింటుంది. చురుకుదనం తగ్గిపోతుంది, మందబుద్ది వస్తుంది. తొమ్మిది నుంచి పదకొండు గంటలు నిద్రపోయే మహిళల్లో గర్భధారణకు అవకాశాలూ తగ్గిపోతాయి. ఎనిమిది గంటలకు మించి నిద్రపోయేవారిలో టైప్ 2 డయాబెటీస్ ముప్పు పెరుగుతుంది. గుండె ఆరోగ్యమూ దెబ్బతింటుంది. ఇవన్నీ ఇటీవల కొన్నేళ్ళల్లో జరిగిన పరిశోధనల్లో తేలిన అంశాలే.