అధికారంలోకి వచ్చాక తొలిసారిగా వైసీపీ నిర్వహిస్తున్న ప్లీనరీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు పేరునా లేఖ రాసి ఆహ్వానించడంతో పార్టీ వార్డు సభ్యులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు అందరూ తొలి రోజున ప్రతినిధుల సభకు కదలివస్తున్నారు. రెండో రోజున విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్రం నలు మూలల నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు తరలి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో.. వర్షం వచ్చినా ప్లీనరీకి హాజరయ్యే వారు తడవకుండా భారీ విస్తీర్ణంలో వాటర్‌ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. వందేమాతరం గీతాలాపనతో ప్లీనరీ మొదలవుతుంది. ఆ తర్వాత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం వైయస్ జగన్, నాయకులు పూలమాలలు వేసి, నివాళులు అర్పిస్తారు. ప్రార్థన పూర్తయ్యాక పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటనను సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేస్తారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సందేశం ఇస్తారు.