వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ విజయం సాధిస్తుందని, మరోమారు వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ తలుపు తట్టినా.. ఏ గుండె చప్పుడు విన్నా జగన్ నినాదమే వినిపిస్తోందని ఆయన అన్నారు. వైసీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్లీనరీకి తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మూడేళ్ల పాలన పూర్తి చేసుకుని నాలుగో ఏడాదిలోకి ప్రవేశిస్తున్నామని.. 2024లోనూ ప్రజల ఆశీస్సులతో రెండోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
‘వచ్చే ఎన్నికల్లోనే జగనే సీఎంగా గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఎలాగైనా అధికారం లాక్కోవాలని, అధికారాన్ని అనుభవించాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నాడు. చంద్రబాబుతో యుద్ధం అయితే ఐదు నిమిషాల్లో ముగించేస్తాం. కానీ ఆయన వెనకున్న దుష్టచతుష్టయంతో యుద్ధం చేయాల్సి వస్తోంది. పచ్చళ్లు అమ్ముకునే స్థాయి నుంచి పచ్చమీడియా స్థాయికెళ్లిన రామోజీరావు, రెండెకరాలతో జీవితం ప్రారంభించి పార్టీలు మారి మామనే వెన్నుపోటు పొడిచి అక్రమంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, వీరికి తోడుగా ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు.. ఈ దుష్టచతుష్టయం జగన్ నుంచి అధికారం లాక్కోవాలని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. మహాభారతంలో పాండవుల దగ్గర నుంచి అధికారాన్ని లాక్కోవాలని ప్రయత్నించిన దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు ఎలా పతనం అయ్యారో.. ఈ రోజున ఆంధ్రరాష్ట్రంలో ఈ దుష్టచతుష్టయం కూడా పతనం కాబోతోంది’
‘ఈ దుష్టచతుష్టయానికి తోడు మరొకాయన ఉన్నాడు. ఎవరైనా తాము అధికారంలోకి రావాలని పార్టీ పెడతారు. కానీ ఈయన మాత్రం చంద్రబాబు అధికారంలోకి రావాలనుకుంటాడు. ఆయనకు అధికారం వద్దు.. ప్యాకేజీ ముద్దు. ఆయన మరెవరో కాదు పవన్ కళ్యాణ్. చంద్రబాబు దత్తపుత్రుడు. పవన్ అభిమానులు ఆయన్ని సీఎం.. సీఎం అంటున్నారు.. కానీ, దత్తపుత్రుడు మాత్రం ప్యాకేజీ తీసుకొని చంద్రబాబుని సీఎం అంటున్నాడు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కష్టపడి అధికారంలోకి వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్. ఎవరెన్ని ఎన్ని కుట్రలు పన్నినా జగన్‌ని ఏమీ చేయలేరు’ అని అంబటి రాంబాబు అన్నారు.