మరో సినీ, క్రీడా రంగానికి చెందిన జంట పెళ్లి పేరుతో ఒకటి కాబోతోంది. గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్న టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్-అతియాశెట్టి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో మూడు నెలల్లోనే వారు వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్టు తెలుస్తోంది. సునీల్-మనా శెట్టి కుమార్తె అయిన అతియాశెట్టి బాలీవుడ్ నటి కాగా, కేఎల్ రాహుల్ టీమిండియా వైస్ కెప్టెన్‌గా, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మూడేళ్లకు పైగా డేటింగ్లో ఉన్న వీరిద్దరూ వచ్చే మూడు నెలల్లో వివాహం చేసుకోబోతున్నట్టు అతియా శెట్టి సన్నిహితులు తెలిపారు.
ఈ క్రమంలో అతియా కుటుంబాన్ని కలిసేందుకు రాహుల్ కుటుంబ సభ్యులు ఇటీవలే ముంబై వచ్చారని తెలుస్తోంది. రాహుల్-అతియాలు వారి కుటుంబ సభ్యులతో కలిసి త్వరలో వారు ఉండబోయే కొత్త ఇంటిని సందర్శించారని, వారి పెళ్లి రెండు కుటుంబాలకు గొప్ప వేడుక అవుతుందని అతియా సన్నిహితులు తెలిపారు. పెళ్లికి సంబంధించిన అన్నింటినీ అతియానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.
గాయంతో ఇంగ్లండ్ పర్యటనకు దూరమైన కేఎల్ రాహుల్ చికిత్స కోసం జర్మనీ వెళ్లగా వెంట అతియా కూడా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాహుల్ కోలుకునేందుకు నెల రోజులు పడుతుందని, అప్పటి వరకు అతియా అక్కడే ఉంటుందని సమాచారం. అహాన్ శెట్టి అరంగేట్ర సినిమా తడప్ ప్రీమియర్ సందర్భంగా రాహుల్-అతియాలు తొలిసారి బహిరంగంగా కనిపించారు.