దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతుంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఆకాశానికి చిల్లులు పడ్డట్లు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అనేంతగా కుండపోత వర్షాలు గుజరాత్ ను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా గుజరాత్ లోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అనేక ప్రాంతాలను వదరనీరు ముంచెత్తుతోంది. నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి.
ఇదిలావుంటే భారీ వర్షాలతో సతమతమవుతున్న గుజరాత్ కు కేంద్రం నుంచి అవసరమైనంత సాయం చేస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ లకు చెందిన ప్లటూన్లు 18 చొప్పున కీలక ప్రాంతాల్లో మోహరించాయని అమిత్ షా తెలిపారు. ఎక్కడ అవసరమైతే అక్కడకు వెంటనే చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ బలగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మరోపక్క, అన్ని డ్యామ్ లు నిండుకుండలను తలపిస్తున్నాయి. డ్యాముల మీద నుంచి వర్షపు నీరు పొంగిపొర్లుతోంది. వర్షాల కారణంగా గత 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. దీంతో ఈ నెల ప్రారంభం నుంచి మృత్యువాత పడిన వారి సంఖ్య 63కి చేరుకుంది. వీరిలో పిడుగులు పడి చనిపోయిన వారు, నీటిలో మునిగిపోయిన వారు, నీటిలో కొట్టుకుపోయినవారు, గోడలు, ఇళ్లు కూలి మరణించిన వారు ఉన్నారు.