‘‘మీరెవరు నన్ను తొలగించడానికి.. నేనే మిమ్మల్ని బహిష్కరిస్తున్నా’’ ఈ మాటన్నది ఎవరో కాదు.. అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం. పార్టీ నుంచి తనను తొలగించే అధికారం పళనిస్వామికి లేదని ఆయన తేల్చి చెప్పారు. తనను పార్టీ నుంచి తొలగిస్తూ తీర్మానం చేయడంపై పన్నీర్ సెల్వం తీవ్రంగా స్పందించారు. తనను తొలగించేందుకు పళనిస్వామి ఎవరని ప్రశ్నించిన ఆయన.. తానే పళనిస్వామిని, సీనియర్ నేత కేపీ మునుస్వానిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. పార్టీకి తానే సమన్వయకర్తనని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు వారిద్దరినీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. న్యాయం కోసం మళ్లీ కోర్టుకెళ్తానని చెప్పారు.
ఇదిలవుంటే నిన్న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అన్నాడీఎంకే సమన్వయకర్తల పదవులను రద్దు చేయడంతోపాటు పన్నీర్ సెల్వం, ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామిని ఎన్నుకున్నారు.