తమ పిల్లాడి కోసం ఓ కుటుంబం ఏకంగా మొసలిని బందించారు. కారణం తమ పిల్లాడిన మింగేసిన మొసలి వదిలేస్తుందన్న ఆశతో. కానీ అధికార్లు నచ్చజెప్పడంతో వారు మొసలిని విడిచిపెట్టారు. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో నది దగ్గర స్నానం చేస్తున్న పదేళ్ల బాలుడిని భారీ మొసలి మింగేసింది. సోమవారం ఉదయం చంబల్ నదిలో స్నానం చేస్తుండగా బాలుడిపై మొసలి దాడి చేసి, అతడిని నదిలోకి లాక్కెళ్లింది. సంఘటనా స్థలంలో ఉన్న స్థానికులు వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వాళ్లంతా అక్కడకు వచ్చి కర్రలు, తాడు, వల సాయంతో మొసలిని నది నుంచి బయటకు లాగి బంధించారు.
సమాచారం అందుకున్న మొసళ్ల సంరక్ష విభాగం బృందం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థుల బారి నుంచి మొసలిని రక్షించేందుకు ఇరు బృందాలు ప్రయత్నించాయి. అయితే సాయంత్రం వరకు బాలుడి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. మొసలి కడుపులో తమ బిడ్డ బతికే ఉంటుందని ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూశారు. మొసలి తమ బిడ్డను బయటకు పంపినప్పుడే వదిలేస్తామని డిమాండ్ చేశారు. చివరకు పోలీసు అధికారులు, మొసళ్ల సంరక్ష విభాగం ఒప్పించడంతో గ్రామస్థులు మొసలిని విడిచిపెట్టారు.