బీజేపి చేతిలో ఇంకా ఎన్నిసార్లు మోసపోతారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో వరదలకు సహాయం పొందలేకపోవడం, సకాలంలో జీతాలకు నిధులు రాకపోవడం, రోడ్లు వేయలేకపోవడం, ప్రత్యేక హోదా సాధించుకోక పోవడం ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధులు సాధించుకోవాలన్న మాట సీఎం నోటి నుంచి రాలేదన్నారు. జగన్‌ని ప్రజలు ఎన్నుకున్నది సీఎంగా ఎంజాయ్ చేయడానికో.. సొంత విషయాలు మాట్లాడుకోవడానికో కాదన్నారు. టీడీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.
తమ అసమర్థతకు, భయానికి సామాజిక న్యాయం అనే ట్యాగును చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్‌లు వేస్తున్నారని శైలజానాథ్ ఎద్దేవా చేశారు. విమానాశ్రయంలో గేటుకు ఒక వైపు వైఎస్సార్‌సీపీ నేతలు, మరో వైపు టీడీపీ నేతలు పోటీపడి స్వాగతం పలికారన్నారు. బీజేపీకి ఏ రాష్ట్రంలో లేని సంఖ్యాబలం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని.. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీని డిమాండ్ చేయాలని.. వైఎస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఎస్సీ, లేని పక్షంలో ఎస్టీని చేయాలన్నారు.
ఇదిలావుంటే భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీలు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన ఎమ్మెల్యేలు, ఎంపీల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. రెండు పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది.