స్మగ్లర్లు తెలివి ప్రదర్శిస్తే..పోలీసులు తమ తెలివిని ప్రదర్శించారు. ఫలితంగా స్మగ్లర్ల గంజాయి పోలీసులకు చిక్కింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ సమీపంలో ఏజెన్సీ నుంచి వస్తున్న వాహనాన్ని బూరుగుపూడి గేటు దగ్గర అటవీశాఖ అధికారులు తనిఖీ కోసం ఆపారు. వెంటనే డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. ఆ వ్యాన్‌లో తనిఖీ చేయగా ప్రత్యేక అరలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు దొరక్కుండా ఫ్లైవుడ్ చెక్కలకు చుట్టూ అంచు ఉంచి మధ్యలో కోసేశారు.
ఇలా సిద్ధం చేసిన చెక్కలను ఒకదానిపై ఒకటి వాహనంలో ఉంచారు. ఆ మధ్యలో ఏర్పడిన ఖాళీ ప్రాంతంలో గంజాయి ఉంచారు. బయట ఎటువైపు చూసినా ప్లైవుడ్ చెక్కలే కనిపించడంతో ఎవరికీ అనుమానం రాదని ప్లాన్ చేసుకున్నారు. 2 కిలోలు బరువు ఉండేలా 364 ప్యాకెట్లు వాహనం నుంచి బయటకు తీశారు. ఆ సరకు విలువ సుమారు రూ.40 లక్షల ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. స్మగ్లర్లు ప్లాన్ అయితే వేశారు కానీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.