గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై అహ్మద్ పటేల్ కుట్ర చేశారని సీట్ వాదనలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇదిలావుంటే కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్‌పై సిట్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు ఆయనపై కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుట్ర పన్నారని సిట్ వెల్లడించింది. ఆ కుట్రలో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, రిటైర్డ్ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ భాగమయ్యారని శుక్రవారం సిటీ సెషన్స్ కోర్టుకు తెలిపింది.
2002 గుజరాత్ అల్లర్ల కేసులో ఆనాటి ముఖ్యమంత్రి సీఎం నరేంద్ర మోదీని ఇరికించేందుకు అహ్మద్ పటేల్ ప్రయత్నించినట్లు సిట్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. అంతేకాకుండా దీనికి సహకరించినందుకు తీస్తా సెతల్వాద్, శ్రీకుమార్, సంజీవ్ భట్‌లకు రూ.30 లక్షలు కూడా ఇచ్చారని రిపోర్ట్‌లో పేర్కొంది. ఇందులో భాగంగా వారు ఫోర్జరీకి పాల్పడినట్టు సిట్ వెల్లడించింది.
అలాగే అప్పటి సీఎం నరేంద్ర మోడీతో సహా గుజరాత్‌లోని వివిధ అధికారులను, ఇతర అమాయక వ్యక్తులను ఇరికించి, విచారించినందుకు సెతల్వాద్ రాజకీయ పార్టీ నుంచి చట్ట విరుద్ధమైన ఆర్థిక, ఇతర ప్రయోజనాలు రివార్డులు పొందినట్టు దర్యాప్తు బృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో సీట్ ఏసీపీ బీసీ సోలంకి తరఫున లాయర్లు శుక్రవారం సెషన్స్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అడిషనల్ సెషన్స్ జడ్జి డీడీ ఠక్కర్ సిట్ సమాధానాన్ని రికార్డ్ చేశారు.
గుజరాత్ అల్లర్ల కేసుల్లో అమాయకులను ఇరికించేందుకు కల్పిత సాక్ష్యాలను సృష్టించినందుకు మాజీ ఐపీఎస్ అధికారులు ఆర్‌బీ శ్రీకుమార్, సంజీవ్ భట్‌లతో పాటు సెతల్వాద్‌ను అరెస్ట్ చేయడం తెలిసిందే. జూలై రెండో తేదీన తీస్తా, శ్రీకుమార్‌లను 14 రోజుల పాటుకు రిమాండ్‌కు తరలిస్తూ అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్ అల్లర్ల కేసుతో లింకు ఉన్న డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిన కేసులో మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్‌ను అహ్మదాబాద్ క్రైం బ్రాంచీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలావుంటే 2020లో అహ్మద్ పటేల్ మరణించారు. ఈ క్రమంలో సిట్ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారని, మరణించిన వారిని కూడా తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నట్లు జైరాం రమేశ్ తన ట్వీట్‌లో ఆరోపించారు. ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి ధోరణి మంచిది కాదంటున్నారు. ఈ క్రమంలో విపక్షాలను తప్పుపట్టేందుకు తన తండ్రి పేరును అన్యాయంగా వాడుతున్నట్టు అహ్మద్ పటేల్ కూతురు ముమ్‌తాజ్ పటేల్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు.