ప్రపంచానికి కరోనా వైరస్ పరిచయమయ్యాక నాటి నుంచి నేటి వరకు అనేక రకాల వ్యాధులు, వైరస్ లు మనకు పరిచయమవుతూనే ఉన్నాయి. కరోనా ముప్పు తొలగక ముందే... మంకీపాక్స్ ముంచుకొచ్చింది. ఇప్పుడు ఇంకో వ్యాధి కలవరానికి గురి చేస్తుంది. అందులోనూ మన దేశంలోనే ఆ వ్యాధితో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. అసోంలో జపనీస్ ఎన్సెఫాలిటిస్ (జేఈ) వ్యాప్తి చెందింది. కేవలం 15 రోజుల్లో కనీసం 23 మంది చనిపోయినట్టు జాతీయ ఆరోగ్య మిషన్ తన నివేదికలో పేర్కొంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 16 జేఈ కొత్త కేసులు బయటపడగా.. నలుగురు చనిపోయారు.
ఈ రోగం బారిన పడి నల్బరీ, మోరిగావ్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. బార్‌పేట, కమ్‌రూప్ మెట్రో పాలిటన్, కర్బీ అంగ్లాంగ్ ఈస్ట్, హోజాయ్‌లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. నాగావ్‌లో నాలుగు, శివసాగర్‌లో రెండు, నల్బరీ, ఉదల్‌గురి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీటితో జూలై 1 నుంచి అసోంలో మొత్తం 160 జేఈ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్యాధికారులు చెబుతున్నారు.
దోమల కారణంగా జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాధి బారిన పడుతుంటారు. ఇటీవల అసోంలో వర్షాలు, వరదలు పోటెత్తాయి. ఇప్పటి వరకు అక్కడ చాలా గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. ప్రతిచోట అపరిశుభ్రత తాండవిస్తుంది. ఈ క్రమంలో దోమలు బాగా పెరిగి.. వ్యాధి విజృంభిస్తుంది. దీంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నామని, వ్యాధిని కట్టడి చేయడానికి అన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నామని అసోంలోని నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం ఆరోగ్య సేవల జాయింట్ డైరెక్టర్ (మలేరియా) కమ్ స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎల్ నునిసా తెలిపారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఫాగింగ్ చేస్తున్నామని, దోమ తెరలు పంపిణీ చేస్తున్నట్టు సునిసా తెలిపారు.
నిజానికి ఈ వ్యాధి ఎప్పటి నుంచో ఉంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తుల్లో మొదట్లో జ్వరం, తలనొప్పి, వాంతులతో బాధపడుతుంటారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తుల్లో గందరగోళం, నాడీ సంబంధిత సమస్యలు, వణుకు, మూర్ఛ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ వ్యాధి కోసం ప్రత్యేకంగా ఎటువంటి చికిత్స లేదు. లక్షణాలు బట్టి మందులు వాడడం, విశ్రాంతి తీసుకోవడం, ఆస్పత్రిలో చేరడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
ఈ వ్యాధి బారిన రోగుల్లో 20 శాతం నుంచి 30 శాతం వరకు మరణించే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు గురైన వారికి తగ్గి.. ప్రాణాలతో బయటపడిన వారిలో 30 శాతం నుంచి 50 శాతం మంది నాడీ సంబంధిత సమస్యలు, మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. ఈ వ్యాధి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనూ, వ్యవసాయం చేసే ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన తర్వాత లక్షణాలు కనిపించడానికి 5 నుంచి 15 రోజులు పడుతుంది. బ్లడ్ టెస్ట్‌లు, బ్రెయిన్ స్కానింగ్స్ ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.