భగత్ సింగ్‌పై శిరోమణి అకాలీదళ్ చీఫ్, సంగ్రూర్ ఎంపీ సిమ్రంజిత్ సింగ్ మాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శిరోమణి అకాలీదళ్ చీఫ్, సంగ్రూర్ ఎంపీ సిమ్రంజిత్ సింగ్ మాన్ (77) భగత్ సింగ్‌ను ఉగ్రవాది అన్నారు. "భగత్ సింగ్ ఒక యువకుడైన బ్రిటిష్ నౌకాదళ అధికారిని చంపాడు. సిక్కు కానిస్టేబుల్ చన్నన్ సింగ్‌ని చంపాడు. జాతీయ అసెంబ్లీపై బాంబు విసిరాడు. ఇప్పుడు మీరు చెప్పండి భగత్ సింగ్ ఉగ్రవాదా కాదా..?" అని సిమ్రంజిత్ సింగ్ మాన్ ప్రశ్నించారు.
అయితే భగత్ సింగ్‌ను ఉగ్రవాదిగా అభివర్ణించడాన్ని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తప్పుబట్టింది. ఎంపీ వ్యాఖ్యలను తోసిపుచ్చింది. సిగ్గుమాలిన చర్యగా పేర్కొంది. ఒక వీరుడిని అగౌరవపరిచేలా మాట్లాడడం సరికాదని, ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అంతేకాదు "పంజాబీలు భగత్ సింగ్ భావజాలంతో ముడిపడి ఉన్నారని, ఈ బాధ్యతారహిత వ్యాఖ్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం." అని ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్ చేసింది.
భగత్ సింగ్‌పై ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కూడా ఖండించారు. కొందరు భగత్‌సింగ్‌ని ఉగ్రవాది అని పిలవడం సిగ్గుచేటని, షహీద్ ఎ ఆజం భగత్ సింగ్ ఒక వీరుడు, దేశభక్తుడు, విప్లవకారుడు, నిజమైన నేల పుత్రుడంటూ ట్వీట్ చేశారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని కూడా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పంజాబ్ రాజకీయాల్లో సంగ్రూర్ ఎంపీ సిమ్రంజిత్ సింగ్ మాన్ గతంలో కూడా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎంపీగా గెలిచిన వెంటనే ఖలీస్థానీ మిలిటెంట్ జర్నైల్ సింగ్ భింద్రావాలేకు తన విజయాన్ని అంకితం చేస్తున్నానని, కశ్మీర్‌లో భారత ఆర్మీ అకృత్యాలను పార్లమెంట్‌లో తెలియజేస్తానన్నారు.