యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం భక్తజన కోలాహలం నెలకొంది. స్వామి ఆలయ మాఢవీధులు, తిరువీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి ప్రాంతాల్లో భక్తుల సందడిగా కనిపించింది. స్వామి ఆర్జిత పూజలు, స్వయంభూ దర్శనాల్లో భక్తులు పాల్గొన్నారు. సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామికి నిత్యపూజలు తెల్లవారు జామున మూడున్నర గంటల నుంచి మొదలయ్యాయి. స్వామిని సుప్రభాతంతో మేల్కొల్సిన అర్చక బృందం తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి, స్వయంభుమూర్తులను అభిషేకించారు. అనంతరం స్వామికి తులసీ సహ స్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలతో దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఘనంగా నిత్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు